Coolie: నాగార్జున ఫిట్‌నెస్‌కు రజినీకాంత్ ఫిదా.. 'కూలి'లో విలన్ పాత్రపై ప్రశంసలు

Coolie: నాగార్జున ఫిట్‌నెస్‌కు రజినీకాంత్ ఫిదా..  'కూలి'లో విలన్ పాత్రపై ప్రశంసలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth  ) నటించిన 'కూలీ' (Coolie ) విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు.  హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రజనీకాంత్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నటుడు అక్కినేని నాగార్జున ( Nagarjuna ) పై ప్రశంసల వర్షం కురిపించారు.  

ALSO READ  సినిమా షూటింగ్‌లు బంద్. .. కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం

ఈ చిత్రంలో నాగార్జున పోషించిన విలన్ పాత్ర 'సైమన్' ఎంతగా ఆకట్టుకుందో రజినీకాంత్ వివరించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ 'సైమన్' పాత్ర గురించి చెప్పినప్పుడు, ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉందో తెలుసుకొని ఆశ్చర్యపోయాను.  ఆ పాత్రను తానే చేయాలనుకున్నానని కూడా చెప్పా.  కానీ నాగార్జునతో ఈ పాత్ర చేయించాలని అనుకుంటున్నారని  లోకేష్   తనకు చెప్పగానే  మరింత ఆశ్చర్యపోయానని గుర్తుచేశారు. నాగార్జున విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా అని  సందేహం వ్యక్తం చేయగా, లోకేష్ మాత్రం ఆయన్ని ఒప్పిస్తానని ధీమాగా చెప్పారు. ఎలాగైనా నాగార్జున గారు ఒప్పుకునేలా చేస్తానని లోకేష్ నాకు మాట ఇచ్చారు అని రజినీకాంత్ గుర్తు చేశారు.

 నాగార్జునతో దాదాపు 33 సంవత్సరాల తర్వాత కలిసి నటించానని రజనీ కాంత్ చెప్పారు. గతంలో వీరిద్దరూ కలిసి 'గీతాంజలి' చిత్రంలో నటించారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నాగార్జునలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన ఇప్పటికీ యంగ్‌గా, ఫిట్‌గా ఉన్నారని రజినీకాంత్ ప్రశంసించారు. ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏమిటని అడిగినప్పుడు, నాగార్జున నవ్వుతూ క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారం, ముఖ్యంగా మా నాన్నగారి నుండి వచ్చిన మంచి జీన్స్ అని బదులిచ్చారని చెప్పుకొచ్చారు.

'కూలి'లో నాగార్జున పోషించిన 'సైమన్' పాత్ర గురించి రజినీకాంత్ మాట్లాడుతూ, "సైమన్ పాత్రలో నాగార్జున గారు అద్భుతంగా నటించారు. ఆ పాత్రను ఆయన కంటే నేను కూడా అంత బాగా చేయలేనేమో అని కొనియాడారు.  నాగార్జున కూడా ఈ చిత్రంలో తన పాత్ర ఒక సవాలుగా భావించానని, రజినీకాంత్ గారి పక్కన విలన్‌గా నటించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల అద్భుతమైన నటన 'కూలి' చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అద్భుతమైన కెమిస్ట్రీని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ కాంత్, అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శ్రుతిహాసన్,  సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రజనీకి విలన్ గా నాగార్జున నటించారు.  ఈ'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.  అనురుధ్ సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.