రాజీవ్​ యువవికాసం ..బీసీ, మైనారిటీల్లో పోటాపోటీ

రాజీవ్​ యువవికాసం ..బీసీ, మైనారిటీల్లో పోటాపోటీ
  • యాదాద్రి జిల్లాలో 39 వేల అప్లికేషన్లు
  • బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్​  
  • జూన్ 2 నుంచి ప్రొసిడింగ్స్

యాదాద్రి, వెలుగు: రాజీవ్ యువ వికాసం (ఆర్ వైవీ) స్కీమ్​కు అప్లికేషన్లు భారీగా వచ్చాయి.   మైనార్టీ, బీసీ ల్లో పోటీ తీవ్రంగా నెలకొంది.  ఈ స్కీమ్​ కింద ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీలు కూడా ఎక్కువగానే పోటీ పడుతున్నారు. రాజీవ్​ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తుల బ్యాంకు  వెరిఫికేషన్ పూర్తయ్యింది.  నెలాఖరులో  లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కంప్లీట్​ చేసి  జూన్​ మొదటివారంలో   ప్రొసిడింగ్స్ ఇవ్వనున్నారు.   

యాదాద్రి జిల్లాలో  39,141 అప్లికేషన్లు

రాజీవ్​ యువ వికాసం పేరిట యువతకు  స్వయం ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది. రేషన్ కార్డులున్న  బలహీన వర్గాలకు చెందిన వారితో పాటు  ఈబీసీ, మైనార్టీ యువత ఉపాధి పొందేందుకు   రూ. 50వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఈ స్కీమ్​ కింద లోన్లు అందిస్తారు.  జిల్లాలో 39,141 మంది అప్లికేషన్లు అందజేశారు.  38,900 మంది మీ సేవాసెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఇతర జిల్లాల్లో ఉంటున్న  241 మంది జిల్లా యువకులు ఆన్​లైన్​లో అప్లై చేశారు.  జిల్లాకు  7,041 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఇందులో  2,600 రూ. 50 వేల యూనిట్లు ఉన్నాయి.  రూ 50 వేల యూనిట్లకు 100 శాతం సబ్సిడీ ఇస్తారు.   

ఈ స్కీమ్​ కోసం  బీసీలు, మైనార్టీలు ఎక్కువ మంది అప్లయ్ చేసుకున్నారు. బీసీలకు 2500 యూనిట్లు మంజూరు కాగా  23,578 మంది అప్లయ్ చేసుకున్నారు.  ఒక్కో యూనిట్​కు  కనీసం 9 మంది పోటీ పడుతున్నారు. మైనార్టీలకు 291 యూనిట్లు మంజూరు కాగా 1,714 మంది అప్లయ్ చేసుకున్నారు.  ఒక్కో యూనిట్​కు  ఐదుగురు కంటే మంది పోటీ పడుతున్నారు.    ఎస్సీలకు 2,937 యూనిట్లు మంజూరుకాగా 10,209 మంది అప్లయ్ చేసుకున్నారు.  ఎస్టీలకు 705 యూనిట్ల మంజూరు కాగా 2, 536 మంది అప్లయ్ చేసుకున్నారు.   ఈబీసీలకు 608 యూనిట్లు మంజూరు కాగా  కేవలం 836 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు.   

ముగిసిన బ్యాంక్ వెరిఫికేషన్

ఈ స్కీమ్కు సంబంధించి  బ్యాంక్ వెరిఫికేషన్ ముగిసింది. అప్లయ్ చేసుకున్న 39,141లో  5 శాతం అప్లికేషన్లను రిజెక్ట్​ చేశారు.  మిగిలిన వారిలో లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జాబితాను ఈ నెల 25లోగా మండల కమిటీలు జిల్లా కమిటీకి పంపించనున్నాయి.  జిల్లా కమిటీ నుంచి ఆ జాబితా ఎమ్మెల్యేల చేతికి వెళ్తుంది. నెలాఖరుకు ఎంపిక ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం జూన్ 2 నుంచి 9 వరకూ లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ అందించనున్నారు.