వీధి కుక్కలకు 'డాగ్ పోలీస్' పెడతారా?.. సుప్రీంకోర్టు తీర్పుపై రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలు!

వీధి కుక్కలకు 'డాగ్ పోలీస్' పెడతారా?.. సుప్రీంకోర్టు తీర్పుపై రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలు!

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కుక్కలను పట్టుకుని, వ్యాక్సిన్, డీవార్మింగ్ చేసి, మళ్లీ వాటి స్థలంలోనే వదలాలని కోర్టు పేర్కొంది.  ఈ తీర్పుపై సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా కుక్కల దాడుల బాధితుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో  సుప్రీం ఈ ఆదేశాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆయన సందేహాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వ్యాక్సిన్‌తో రక్షణ లభిస్తుందా?
కోర్టు తీర్పు ప్రకారం కుక్కలకు వ్యాక్సిన్ వేయడం, డీవార్మింగ్ చేయడం వల్ల అవి సురక్షితంగా మారతాయని అనుకోవచ్చా? కుక్కలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటే పిల్లలను కరవకుండా ఎలా కాపాడుతుంది? వాటి మెడికల్ ఫైల్ చూసి కరవాలో లేదో నిర్ణయించుకుంటాయా? ఒక రేబిస్ షాట్ కుక్కల ఆకలిని, వాటి సహజ వేట ప్రవృత్తిని అమాంతం ఆపేస్తుందా? అని  సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ  ప్రశ్నించారు. అలాగే, ఇన్నేళ్లుగా పిల్లలు కుక్కల దాడిలో చనిపోవడానికి పురుగుల సమస్యే కారణమా? ఇప్పుడు డీవార్మింగ్ చేస్తే ఈ దాడులు ఆగిపోతాయా? ఇన్ని సంవత్సరాలు పిల్లలు చనిపోవడానికి పురుగుల సమస్యే కారణమా? అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

 కుక్కల మానసిక స్థితిని ఎవరు నిర్ణయిస్తారు?
రేబిస్ ఉన్న లేదా దూకుడుగా ఉండే కుక్కలను తిరిగి వదలకూడదని కోర్టు చెప్పింది. మరి దేశంలో కోట్లాది వీధి కుక్కలకు రేబిస్ పరీక్షలు చేసేంత మౌలిక సదుపాయాలు, మానవ వనరులు మన దగ్గర ఉన్నాయా? ప్రతి కుక్క మానసిక ఆరోగ్య స్థితిని నమోదు చేయడానికి సైకియాట్రిస్టులను నియమిస్తారా? అని ఆర్జీవీ తన ప్రశ్నల పరంపరను కొనసాగించారు. 

►ALSO READ | కేరళలో కలకలం.. పోలీసుల అదుపులో కేంద్ర మంత్రి సురేష్ గోపి కుమారుడు!

కుక్కల దూకుడును కొలవడానికి ఒక మీటరును తయారు చేస్తారా? ఒక కుక్క ఒక క్షణం కరిచి, ఆ మరుక్షణమే తోక ఊపితే దాన్ని దూకుడుగా పరిగణిస్తారా? లేదా స్నేహపూర్వకంగా భావిస్తారా? లాయర్లు, కుక్కల ప్రేమికులు, పశువైద్యులు, డాగ్ సైకియాట్రిస్టుల కమిటీ కూర్చుని ప్రతి కుక్క మూడ్ స్వింగ్స్ గురించి చర్చిస్తుందా? అంటూ వర్మ  వ్యాఖ్యాంచారు. వేల సంఖ్యలో స్పెషల్ కోర్టులు పెట్టి, ప్రతి కుక్కను 'నిందితుడి'గా నిలబెట్టి, విచారించి, తిరిగి వదలాలా వద్దా అని నిర్ణయిస్తారా?" అని ఆయన ట్వీట్ చేశారు.

 "డాగ్ పోలీస్" ఏర్పాటు చేస్తారా?
కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం పెట్టాలన్న ఆదేశాలపై వర్మ స్పందిస్తూ,  ఆ నిర్దేశిత ప్రాంతాలను ఎవరు, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? కుక్కలకు ఆ ప్రాంతాలు ఎలా తెలుస్తాయి? వాటి కోసం ప్రత్యేకంగా 'డాగ్ గూగుల్ మ్యాప్స్' ఇస్తారా?" అని ప్రశ్నించారు.  వేలాది పట్టణాలు, గ్రామాల్లో కుక్కలకు ఆహారం పెట్టే పర్యవేక్షణకు మున్సిపల్ అధికారులను, పోలీసులను లేదా కొత్తగా 'డాగ్ పోలీస్' అనే బలగాన్ని ఏర్పాటు చేస్తారా? అని ఆర్జీవీ సందేహాలు వ్యక్తం చేశారు. మానవుల వలసలను ఆపలేని మనం, కుక్కలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా ఎలా అడ్డుకుంటాం? అని ఆయన ప్రశ్నించారు.

ఈ మొత్తం ఆదేశాల్లో, కుక్కల దాడికి బలైన పిల్లలు, బాధితుల ప్రస్తావన ఎక్కడా లేకపోవడంపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుది తీర్పు ఇచ్చే ముందు గౌరవనీయ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు., వీధి కుక్కల సమస్యపై ఉన్న తీవ్రతను, ప్రభుత్వ యంత్రాంగం ఎదుర్కొనే సవాళ్లను సూటిగా ప్రశ్నించేలా ఆర్జీవీ తన సందేహలను లేవనెత్తారు.