బీ టీమ్‌ అంటే ఊరుకునేది లేదు 

బీ టీమ్‌ అంటే ఊరుకునేది లేదు 

శ్రీలంక పర్యటన కోసం భారత్ బీ జట్టును పంపడం తమకు అవమానకరమని లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కామెంట్లపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. భారత్ పంపింది బీ టీమ్‌ను కాదని.. సెకండ్ స్ట్రింగ్ టీమ్‌ను పంపిందని సెహ్వాగ్ చెప్పడు. అయినా ఓ జాతీయ జట్టును బీ టీమ్‌ అని ఎలా పిలుస్తారంటూ రణతుంగపై వీరూ విమర్శలకు దిగాడు. లంక టూర్‌లో ఉన్న టీమిండియాలో ప్రతిభావంతులైన ప్లేయర్లకు కొదువ లేదని స్పష్టం చేశాడు.

‘అర్జున రణుతంగ వ్యాఖ్యలు సరికావు. ఆయన మన జట్టును చూసి బీ టీమ్ అని భావిస్తున్నట్లున్నారు. కానీ భారత క్రికెట్ సామర్థ్యం ఏంటో ఆయనకు తెలియదు. మనం ఏ జట్టును పంపినా అది బీ టీమ్ అవ్వదు. ఐపీఎల్‌ వల్ల భారత్‌కు కలిగిన ప్రయోజనం ఇది. మన దగ్గర చాలా మంది ట్యాలెంటెడ్‌ ప్లేయర్లు ఉన్నారు. వారినందర్నీ ఒకే జట్టులో కూర్చడం కుదరదు. లంక టూర్‌‌లో ఉన్న భారత జట్టును రణతుంగా బీ టీమ్‌గా పిలుస్తున్నారు. దీన్ని మేం అంగీకరించం. ఇదే టీమ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు పంపిస్తే వాళ్లు ఆ జట్టును కూడా ఓడిస్తారు. సెకండ్ స్ట్రింగ్ టీమ్‌ను పంపినందుకు లంక బోర్డు బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ టూర్ అవసరం లేదు, కుదరదు అని బీసీసీఐ సులువుగా చెప్పేసి ఉండొచ్చు. కానీ మన బోర్డు అలా చేయలేదు. ఈ సిరీస్ వల్ల లంక బోర్డు, ప్లేయర్లకు ఆర్థికంగా సాయం అందుతుంది. ఒకవేళ మన జట్టు ఆ సిరీస్ ఆడకపోతే ఆరు మ్యాచ్‌లకు సంబంధించిన స్పాన్సర్‌షిప్‌, ఫండ్స్‌ను శ్రీలంక బోర్డు కోల్పోవాల్సి వచ్చేది. దీన్ని అర్థం చేసుకోవాలి’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా, లంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.