ఎంసీఆర్​హెచ్ ఆర్డీఐలో ప్రభుత్వ గెస్ట్ హౌస్​

ఎంసీఆర్​హెచ్ ఆర్డీఐలో ప్రభుత్వ గెస్ట్ హౌస్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్​హెచ్ ఆర్డీఐలో రూ.7 కోట్లతో గెస్ట్ హౌస్​ ను ప్రభుత్వం నిర్మించనుంది. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ బిల్డింగ్ కు నిధుల విడుదలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గెస్ట్ హౌజ్ తో పాటు హెలిప్యాడ్ ను కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి సీఎం రేవంత్ ​నివాసం దగ్గరగా ఉండడం, లోపల గుట్టపైన ఈ బిల్డింగ్ ఉండడం, ట్రాఫిక్ ను కూడా పెద్దగా ఆపాల్సిన అవసరం లేకుండా, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దీనిని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన సొంత నివాసంలో ఉంటున్నారు. 

అధికారిక రివ్యూలు, మీటింగ్ లు అన్ని సెక్రటేరియెట్ లోనే నిర్వహిస్తున్నారు. కాగా, సీఎంగా ప్రమాణం చేసిన నాలుగు రోజుల తరువాత రేవంత్ ఎంసీఆర్​హెచ్ ఆర్డీఐని పరిశీలించారు. 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంసీహెచ్ఆర్డీని క్యాంప్ ఆఫీస్ గా వినియోగించాలని అప్పట్లోనే నిర్ణయించారని అధికారులు చెప్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులుగా బేగంపేటలోని మెట్రో రైల్ భవన్, పైగా ప్యాలెస్ లను సైతం అధికారులు పరిశీలించారు. అయితే, అవి సికింద్రాబాద్ వెళ్లే మెయిన్ రోడ్ లో ఉండడం, అధిక ట్రాఫిక్ కారణంగా పబ్లిక్ కు ఇబ్బందులు ఏర్పడుతాయన్న నేపథ్యంలో ఎంసీఆర్​హెచ్ఆర్డీఐకే సీఎం మొగ్గు చూపారని తెలుస్తోంది.