- ముంపు గ్రామాల నిర్వాసితులకు ఊరట
నాగర్‌కర్నూల్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రభావిత గ్రామాల నిర్వాసితుల పునరావాసం సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కదిలింది. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ అవార్డులపై చర్చించారు. రైతుల ప్రయోజనాలు కాపాడుతూ చట్టబద్ధంగా భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు పారదర్శకంగా పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందించాలని కమిషనర్ ఆదేశించారు.
వట్టెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీని పరిశీలించిన కమిషనర్
జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన పునరావాస, పునర్వ్యవస్థీకరణ (ఆర్‌అండ్‌ఆర్) కాలనీని తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సోమవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి కాలనీలో నిర్మించిన గృహాలు, అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులను పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
