రెండు విడతల్లో రంగారెడ్డి స్థానిక సమరం.. వివరాలు వెల్లడించిన కలెక్టర్ నారాయణరెడ్డి

రెండు విడతల్లో రంగారెడ్డి స్థానిక సమరం.. వివరాలు వెల్లడించిన కలెక్టర్ నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​నుంచి కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి ఎన్నికల నిర్వహణపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలకు, 230 ఎంపీటీసీలకు, 526 సర్పంచ్​, 4,668 వార్డు సభ్యుల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని చెప్పారు. 

తొలి విడతలో భాగంగా అక్టోబర్ 9న చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్​, శంకర్​పల్లి, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్గల్, తలకొండపల్లి, శంషాబాద్​జడ్పీటీసీ స్థానాలకు, 110 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్, 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 23న 657 పోలింగ్​స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందన్నారు.  

రెండో విడతలో

ఫరూఖ్​నగర్, కొత్తూర్​, నందిగామ, కేశంపేట్, కొందుర్గ్​, జిల్లెడ్​చౌదర్​గూడెం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​ మెట్, మంచాల, యాచారం, మాడ్గుల జడ్పీటీసీ స్థానాలకు, 120 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 13 నోటిఫికేషన్, 15 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 27న 691 పోలింగ్​ స్టేషన్లలో పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఈ రెండు విడతాల ఓట్ల లెక్కింపు నవంబర్​11న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.  

తొలి విడత సర్పంచ్​ ఎన్నికలు ఇక్కడే 

చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్​పల్లి, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్గల్, తలకొండపల్లి, శంషాబాద్​మండలాల్లోని 264 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్​, 2,300 వార్డు సభ్యులకు అక్టోబర్ 17న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అదే రోజు నుంచి 19  వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. 31న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్​మొదలవుతుందని చెప్పారు.  

రెండో విడత సర్పంచ్ ​ఎన్నికలు  

ఫరూఖ్​నగర్, కొత్తూర్​, నందిగామ, కేశంపేట్, కొందుర్గ్​, జిల్లెడ్​చౌదర్​గూడెం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్, మంచాల, యాచారం, మాడ్గుల మండలాల్లోని 262 గ్రామపంచాయతీల్లో సర్పంచ్​, 2,368 వార్డు సభ్యులకు అక్టోబర్ 21 నోటిఫికేషన్, 23 నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నవంబర్ 4 న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు పోలింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్​షురూ చేస్తామన్నారు. జిల్లా అడిషనల్​కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నోడల్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.