వేగంగా పడిపోతున్న ఎయిర్​ క్వాలిటీ

వేగంగా పడిపోతున్న ఎయిర్​ క్వాలిటీ
  • చలికాలంలో 8 శాతం పెరిగిన కాలుష్యం
  • గత నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా నమోదు
  • సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్​మెంట్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో కాలుష్యం పెరుగుతున్నది. రోజురోజుకు పడిపోతున్న ఎయిర్ క్వాలిటీనే ఇందుకు ఉదాహరణ. మూడు, నాలుగు ప్రాంతాలు మినహా సిటీ అంతా పూర్ ఎయిర్​ క్వాలిటీ నమోదవుతున్నది. గత నాలుగేండ్లతో పోలిస్తే శీతాకాలపు కాలుష్యం 2022–23 లో 8 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్​ఈ)తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

సీఎస్‌‌ఈ గత నాలుగేండ్లుగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు పీఎం 2.5 సాంద్రతలలో వార్షిక, కాలానుగుణ ధోరణులను అంచనా వేసింది. ఢిల్లీ, కోల్‌‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల నుంచి రియల్‌‌ టైం డేటా ఆధారంగా నివేదికను రూపొందించింది. ఇందులో గత నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ చలికాలంలో బెంగళూరు, హైదరాబాద్‌‌ అత్యంత కాలుష్యాన్ని చవిచూశాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాహనాలు, పరిశ్రమలు, వ్యర్థాలు, నిర్మాణం, గృహాలలో ఘన ఇంధన వినియోగం మొదలైన వాటి నుంచి  వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మెట్రో సిటీస్‌‌లో

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్​మెంట్ నివేదిక ప్రకారం చలికాలంలో బెంగుళూరు 63 శాతం,  చెన్నైలో 28 శాతం, హైదరాబాద్ లో 8 శాతం పొల్యూషన్ పెరిగింది. ముంబై లో ఏడు శాతం, కోల్‌‌కతాలో 15శాతం, ఢిల్లీలో 23శాతం తగినట్లు వెల్లడించింది. ముఖ్యంగా మెగా సిటీల్లోని  చెత్త ప్రదేశాల్లో కాలుష్య స్థాయి 50 శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌‌లో పీఎం 2.5 లెవల్స్ అధికంగా పెరిగాయని సీఎస్‌‌ఈ పేర్కొంది. 

పూర్ ఎయిర్ క్వాలిటీ 

హైదరాబాద్​లో  ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోతున్నది. గాలిలో ధూళికణాల తీవ్రత పెరిగిపోతున్నది. బంజారాహిల్స్, హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్, కోఠి, కేపీహెచ్‌‌బీ, మాదాపూర్, మణికొండ, జూపార్క్, పాశమైలారం ఇలా అనేక ప్రాంతాల్లో అన్ హెల్దీగా ఎయిర్ క్వాలిటీ నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో  పీఎం(పార్టిక్యులేట్ మేటర్) 2.5 ప్రకారం 0–50 ఉంటే గుడ్, 50–100 ఉంటే మోడరేట్, 100–150 మధ్యలో ఉంటే అన్ హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, 150–200 ఉంటే అన్ హెల్దీ, 200–300 ఉంటే వెరీ అన్ హెల్దీగా  నమోదవుతున్నట్లు లెక్క. అయితే ప్రస్తుతం హైదరాబాద్​లో చాలా చోట్ల పీఎం 2.5 అన్ హెల్దీగా రికార్డవుతున్నది. శుక్రవారం యూఎస్ కాన్సులేట్ ఏరియాలో 151, కోకాపేట లో 110, కేపీహెచ్​బీలో 112 లుగా పూర్ ఎయిర్ క్వాలిటీ లెవల్స్ 
నమోదయ్యాయి.  

వెహికల్స్​, ఫ్యాక్టరీలతో

గ్రేటర్​ హైదరాబాద్​లో కోటికిపైగా జనాభా ఉంటే 60 లక్షలకుపైగా వాహనాలున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఉపయోగం తగ్గిపోవడం, మెట్రో ట్రావెల్ చేయాలన్నా ఇంటి నుంచి ఇతర వాహనాల్లో స్టేషన్​కు రీచ్ అవడం, షేరింగ్​గా ట్రావెల్ చేయాలంటే జనాలు ఇష్టపడకపోవడం వంటి వాటి వల్ల వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఒక్కో వాహనం నుంచి వెలువడే పొగతో గాలిలో కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. పాత వాహనాలను తీసేయాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికి ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. రోడ్ల  విస్తీర్ణం తక్కువగా ఉండటం, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా పొల్యూషన్​కు  ప్రధాన కారణమవుతున్నదని అంటున్నారు. జీడిమెట్ల, నాచారం, ఉప్పల్, పాశమైలారం, మల్లాపూర్, గడ్డిపోచారం తదితర ప్రాంతాల్లో ఫార్మసీకి చెందిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి వల్ల కూడా గాలి కలుషితమవుతున్నది.

టౌన్​ ప్లానింగ్​ను బెటర్​ చేయాలి

హైదరాబాద్  టౌన్ ప్లానింగ్​ను బెటర్ చేయాలి. కూకట్​పల్లి వంటివి హైలీ పొల్యూటెడ్ ఏరియాలుగా మారిపోతున్నాయి. పరిశ్రమలు వ్యర్థాలను డ్రైనేజీలో వదిలేస్తున్నాయి. పటానుచెరు, ఐడీపీఎల్, జీడిమెట్లలోని పరిశ్రమలు వ్యర్థాలను పైప్ లైన్ లలో వదిలేస్తున్నారు. అవి మూసీలో వచ్చి కలుస్తున్నాయి.    

- జీవానంద రెడ్డి, పర్యావరణవేత్త