
కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలామ్ ల ఫొటోలనూ ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందంటూ జరిగిన ప్రచారంలో వాస్తవికత లేదని తేలిపోయింది. అటువంటి ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.
RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat
— ReserveBankOfIndia (@RBI) June 6, 2022
రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలామ్ ల వాటర్ మార్క్ ఫొటోలను కరెన్సీ నోట్లపై ప్రచురించాలని కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ యోచిస్తున్నాయంటూ ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అమెరికా కరెన్సీ నోట్లపై జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్ సహా ఎంతోమంది ప్రముఖుల ఫొటోలను ముద్రిస్తుంటారు. ఇకపై అదే తరహాలో మన దేశంలోనూ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు భారతజాతి గర్వించే ఇంకొందరు ప్రముఖుల ఫొటోలను కూడా ప్రచురిస్తారంటూ ఆయా కథనాల్లో ప్రస్తావించారు. తాజాగా ఆర్బీఐ వివరణ ఇవ్వడంతో అలాంటి ప్రతిపాదనలేవీ లేవని తేటతెల్లమైంది.
మరిన్ని వార్తలు..