బ్యాంకుల సీఈఓలతో ఇయ్యాల ఆర్ బీఐ సమావేశం

బ్యాంకుల సీఈఓలతో ఇయ్యాల ఆర్ బీఐ సమావేశం

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు.  డిపాజిట్ వృద్ధి  నెమ్మదిగా ఉండటం, అధిక క్రెడిట్ డిమాండ్​ను కొనసాగించడానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.  రిజర్వ్ బ్యాంక్  డేటా ప్రకారం, బ్యాంకు డిపాజిట్లు వార్షికంగా 10.2 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గాయి.  లోన్లకు డిమాండ్​ ఏడాదికి 6.5 శాతం నుండి 17.9 శాతం పెరిగింది. డిపాజిట్లు, లోన్లతోపాటు రిటైల్,  ఎంఎస్​ఎంఈ విభాగంలో ఆస్తుల నాణ్యతపై చర్చ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో ప్రారంభించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల పనితీరును కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు. రిటైల్, పరిశ్రమ  సేవల విభాగాలకు లోన్ల పెరుగుదల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆశించిన గ్రోత్​ కనిపించింది. నాన్​–ఫుడ్​ క్రెడిట్​గ్రోత్​ 2022 మార్చి లో 8.7 శాతం నుండి సెప్టెంబరు 2022లో 16.4 శాతానికి.. అంటే దాదాపు రెండింతలు పెరిగింది.  ఈసీఎల్​జీ పథకం సహాయంతో ఎంఎస్​ఎంఈలకు  క్రెడిట్​గ్రోత్​ పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్లకు తక్కువ వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్​జీఎస్​) కింద అదనంగా రూ. 50 వేల కోట్లను ఇచ్చే ప్రతిపాదనను  కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

దీంతో ఈసీఎల్​జీఎస్​ పరిమితి రూ. 4.5 లక్షల కోట్ల నుండి రూ. 5 లక్షల కోట్లకు పెరిగింది. అదనపు మొత్తాన్ని టూరిజం, హాస్పిటాలిటీ సంస్థలకు ప్రత్యేకంగా కేటాయించారు. కరోనాతో నష్టపోయిన వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్​ఎంఈ విభాగంలో 7 శాతం రాయితీ రేటుతో క్రెడిట్ పొందడానికి ఈసీఎల్​జీఎస్​ను​ 2020 మేలో ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు ఈసీఎల్​జీఎస్​ కింద సుమారు రూ. 3.67 లక్షల కోట్ల అప్పులు ఇచ్చారు.