గత మూడేళ్లలో రూ. 52 లక్షల కోట్లు నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ

గత మూడేళ్లలో రూ. 52 లక్షల కోట్లు నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ
  • గత మూడేళ్లలో రూ. 52 లక్షల కోట్లను ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది
  • రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం దెబ్బపై దెబ్బ కొడుతోంది:  ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఎకానమీ గత మూడేళ్లలో ఏకంగా రూ. 52 లక్షల కోట్లు (అవుట్‌‌ పుట్ పరంగా– అంటే ప్రొడక్షన్ తగ్గిందని అర్థం) నష్టపోయింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతోంది,  పరిస్థితుల చక్కబడుతున్నాయనే టైమ్‌‌లో వివిధ కరోనా వేవ్‌‌లు దెబ్బపై దెబ్బ కొడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌‌ – రష్యా సంక్షోభం, యూఎస్ ఫెడ్ పాలసీ వైఖరీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.  దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా నష్టాలను పూడ్చుకోవడానికి ఏకంగా 12 ఏళ్లు పడుతుందని రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. అది కూడా పరిస్థితులు నిలకడగా మారతాయనే అంచనాలతో ఈ లెక్కలు వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతోందన్న టైమ్‌‌లో కరోనా వేవ్‌‌లు వచ్చి రికవరీపై దెబ్బ కొట్టాయని  2021–22 కి సంబంధించి ఆర్‌‌‌‌బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్‌‌ (ఆర్‌‌‌‌సీఎఫ్‌‌) పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌లో దేశ జీడీపీ భారీగా తగ్గింది. ఆ తర్వాత  2021–22  ఏప్రిల్‌‌–జూన్ క్వార్టర్‌‌లో సెకెండ్ వేవ్‌‌ వచ్చేంత వరకు  దేశ ఎకానమీ షార్ప్‌‌ రికవరీ అయ్యింది. అదే విధంగా సెకెండ్ వేవ్‌‌ నుంచి బయటపడి తిరిగి రికవరీ బాట పట్టామనే టైమ్‌‌లో థర్డ్‌‌ వేవ్ వచ్చి ఎకానమీపై దెబ్బ కొట్టింది.  ఈ ఏడాది జనవరిలో థర్డ్‌‌ వేవ్ ప్రభావం కనిపించింది. దీంతో దేశ ఎకానమీ రికవరీ ఆగిందని ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్ వెల్లడించింది.  ప్రస్తుతం ఉక్రెయిన్‌‌–రష్యా సంక్షోభంతో గ్లోబల్‌‌గా, లోకల్‌‌గా ఎకానమీ గ్రోత్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సంక్షోభం వలన కమోడిటీ ధరలు విపరీతంగా పెరిగాయి. సప్లయ్ చెయిన్‌‌లో సమస్యలు నెలకొన్న విషయం తెలిసిందే.  

2034-35 వరకు పడుతుంది..

కరోనాకు ముందు దేశ జీడీపీ గ్రోత్ రేటు (2012–13 నుంచి 2019–20 మధ్య) ఏడాదికి  సగటున 6.6 శాతంగా  ఉంది.  అదే ఎకానమీ స్లోడౌన్ టైమ్ పీరియడ్‌‌ను తీసేస్తే  మిగిలిన (2012–13 నుంచి 2016–17 మధ్య) టైమ్‌‌ పీరియడ్‌‌లో దేశ జీడీపీ గ్రోత్ రేటు సగటున ఏడాదికి 7.1 శాతంగా నమోదయ్యింది. ‘ గత మూడేళ్ల వాస్తవిక గ్రోత్ రేటు చూస్తే 2020–21 లో మైనస్‌‌ 6.6 శాతం, 2021–22 లో 8.9 శాతంగా ఉంది. అదే 20‌‌‌‌22–23 లో 7.2 శాతంగా,  ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో సగటున 7.5 శాతంగా జీడీపీ గ్రోత్ రేటు ఉంటుందని అంచనావేస్తే..కరోనా వలన వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి 2034–35 వరకు టైమ్ పడుతుంది’  అని ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్ వెల్లడించింది. కరోనా వలన  అవుట్​పుట్​ పరంగా 2020–21  రూ. 19.1 లక్షల కోట్లను, 2021–22 లో రూ. 17.1 లక్షల కోట్లను దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని  ఈ రిపోర్ట్ అంచనావేసింది. అదే విధంగా 2022–23 లో రూ. 16.4 లక్షల కోట్ల నష్టం వస్తుందని లెక్కించింది. కాగా, ఈ రిపోర్ట్‌‌ను  ఆర్‌‌‌‌బీఐకి చెందిన డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్ ఎకనామిక్‌‌ అండ్ పాలసీ రీసెర్చ్‌‌ (డీపీపీఆర్‌‌‌‌) అధికారులు తయారు చేశారు. ఈ అధికారుల ఆలోచనలు మాత్రమే ఈ రిపోర్ట్‌‌ వెల్లడిస్తోందని, ఆర్‌‌‌‌బీఐ ఆలోచనలు కాదని రిజర్వ్‌‌ బ్యాంక్ ప్రకటించింది. 

ప్రభుత్వ అప్పులు తగ్గాలి

దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌‌గా రికవరీ అవ్వాలంటే  ధరలు (ఇన్‌‌ఫ్లేషన్‌‌) నిలకడగా ఉండాలని ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్ అంచనావేసింది.  రానున్న కాలంలో దేశ జీడీపీ గ్రోత్ రేటు 6.5 నుంచి 8.5 శాతం మధ్య  నిలకడగా ఉండాలని, దీనికి  బలమైన రీఫామ్స్‌‌ సపోర్ట్ ఉండాలని రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్‌‌ (ఆర్‌‌‌‌సీఎఫ్‌‌)–2021–22 రిపోర్ట్ వెల్లడించింది.  ‘ఆర్థిక, ద్రవ పరమైన పాలసీలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. సస్టయినబుల్ గ్రోత్‌‌కు   ధరలు నిలకడగా ఉండడం అవసరం’ అని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్రభుత్వ అప్పులు 66 శాతంలోపు తీసుకురావాల్సి ఉంది. ప్రభుత్వం కుదుర్చుకుంటున్న  ఫ్రీ–ట్రేడ్ అగ్రిమెంట్లు టెక్నాలజీ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఈ రిపోర్ట్ అబిప్రాయపడింది. రూరల్ ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు సమగ్రమైన ప్లాన్‌‌ ఒకటి అవసరం అని పేర్కొంది. అగ్రికల్చర్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌ రిలేటెడ్‌‌ సెక్టార్‌‌‌‌, టెక్నాలజీ  సర్వీసెస్‌‌, ఎక్స్‌‌పోర్ట్స్‌‌, డిజిటలైజేషన్, రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లు కరోనా టైమ్‌‌లోనూ స్ట్రాంగ్‌‌గా నిలబడ్డాయని, దీంతో దేశ ఎకానమీ బలంగా రికవరీ అవుతుందనే నమ్మకం కుదిరిందని ఈ రిపోర్ట్‌‌ విడుదల సందర్భంగా ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.