- 45వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రెడీ
- వనపర్తి కేంద్రంగా ఐదు జిల్లాలకు విత్తనాలు సరఫరా
- పచ్చిరొట్ట విత్తనాలపై 50శాతం సబ్సిడీ
వనపర్తి, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి విత్తన పంపిణీకి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వనపర్తిలోని కేంద్రం నుంచే ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలకు విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 45,000 క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విత్తనాల కోటాను రెట్టింపు చేయడం విశేషం. వరితో పాటు కందులు, పెసలు, మినుములు లాంటి విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో
ఉంచారు.
సబ్సిడీ కేవలం పచ్చిరొట్ట ఎరువులకే
గత ఐదేళ్లుగా ప్రభుత్వం వరి, పప్పు ధాన్యాలపై రాయితీని నిలిపివేసింది. ప్రస్తుతం కేవలం పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలపై మాత్రమే 50 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఈ సీజన్‌లో సుమారు 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను రాయితీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వరి, ఇతర అపరాల విత్తనాలను రైతులు ఎలాంటి రాయితీ లేకుండానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని గుర్తించిన అగ్రోస్ సీడ్ సేల్స్ సెంటర్లలో నిల్వ చేస్తున్నారు.
ధరలు ఇలా..
రాయితీపై లభించే 30 కిలోల జీలుగ బస్తా ధర రూ.2,452.50 కాగా, 40 కిలోల జనుము బస్తా ధర రూ.3,110గా నిర్ణయించారు. సబ్సిడీ ఆశించే రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలను స్థానిక వ్యవసాయ అధికారులకు అందించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వరి 25 కిలోల బీపీటీ (5204) రకం బస్తా ధర రూ.1030గా, ఇతర రకాలు రూ.1020గా ఉన్నాయి. కందులు 4 కిలోలు రూ.520, పెసలు రూ.544, మినుములు రూ.535 చొప్పున విక్రయిస్తున్నారు.
దుక్కులు సిద్ధం చేస్తున్రు..
ఎండలు దంచికొడుతుండడంతో ఈ సారి సీజను కొంత ఆలస్యం కావొచ్చేమోనని భావించిన రైతులు ముందస్తుగా వేసవి లో దుక్కులకు ఉపక్రమించారు. సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
రెట్టింపు విత్తనాలు ఇస్తాం..
పచ్చిరొట్ట ఎరువులను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నాం. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నిరుడు 23వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు ఇచ్చాం. ఈ సారి రెట్టింపు విత్తనాలు ఇవ్వనున్నాం.
-ఆదినారాయణరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్, వనపర్తి-
