
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నుంచి ‘సేమ్ డే సెటిల్‌మెంట్’ విధానాన్ని అమల్లోకి తేవడానికి రెడీగా ఉన్నామని సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పేర్కొన్నారు. టీ+0 విధానం అమల్లోకి వస్తే ఇన్వెస్టర్లు కొన్న షేర్లు అదే రోజు తమ డీమాట్ అకౌంట్లకు వస్తాయి. సెటిల్‌మెంట్స్‌ను ఇప్పటికే టీ+2 నుంచి టీ+1 కి తగ్గించిన సెబీ, మరింతగా మెరుగుపరిచే పనిలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ట్రేడ్ల కోసం టీ+0 సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తామని, అక్కడి నుంచి ‘తక్షణ’ సెటిల్‌మెంట్ విధానానికి మారుతామని చెప్పారు.
ఈ విధానంలో షేర్లు కొన్న వెంటనే ఇన్వెస్టర్ల డీమాట్ అకౌంట్లలో యాడ్ అవుతాయి. ప్రాఫిట్స్ వస్తే వెంటనే సెటిల్ అవుతాయి. దేశంలో టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యిందని, ఇన్‌స్టిట్యూషన్లతో కలిసి ఒక విధానాన్ని తీసుకురాగలిగామని, అందుకే టీ+1 ఇన్వెస్టర్ల ముందుకు తెచ్చామన్నారు. టెక్నాలజీ సాయంతో గత 20 ఏళ్లలో సాధించింది కేవలం రెండున్నరేళ్లలోనే సాధించామని చెప్పారు.