వైన్​షాపుల కోసం.. రియల్టర్ల పోటీ

వైన్​షాపుల కోసం.. రియల్టర్ల పోటీ
  • టెండర్లలో 30 నుంచి 40 శాతం వారివే!
  • రియల్​ ఎస్టేట్ నష్టాలను పూడ్చుకునేందుకు లిక్కర్​ బిజినెస్​ వైపు అడుగులు
  • మీటింగులు పెట్టి అవగాహన కల్పిస్తున్న ఆబ్కారీ ఆఫీసర్లు
  • బుధవారం సాయంత్రం వరకు 41,754 అప్లికేషన్లు

మహబూబ్​నగర్/ నల్గొండ, వెలుగు: మూడేండ్లుగా రియల్​ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న రియల్టర్లు లిక్కర్​ బిజినెస్​పై కన్నేశారు. ఈ వ్యాపారంలో లాభాలే తప్ప నష్టాలు లేకపోవడంతో హైదరాబాద్​ సహా అన్ని జిల్లాల్లో లిక్కర్​ షాపుల టెండర్లు దక్కించుకునేందుకు ఎగబడ్తున్నారు. ముఖ్యంగా రాజధానికి చెందిన రియల్టర్లు హైదరాబాద్​లో పోటీ ఎక్కువగా ఉండడంతో ఉమ్మడి పాలమూరు, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో టెండర్లు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 41,754 అప్లికేషన్లు ​రాగా.. వీటిలో 30 నుంచి 40 శాతం రియల్టర్లు వేసినవే ఉన్నాయని ఆబ్కారీ ఆఫీసర్లు చెప్తున్నారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారం పుంజుకుంది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరింత ఊపువచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో ఎకరా భూమి రూ.3 కోట్ల నుంచి  రూ.15  కోట్లకు ఎగబాకింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్​లాంటి జిల్లాల్లోనూ భూముల రేట్లు ఆల్ టైం రికార్డ్స్​ క్రియేట్​ చేశాయి. 2019 వరకు ఈ బిజినెస్ బాగానే జరిగినా.. కరోనా తర్వాత 2020 నుంచి పూర్తిగా డీలా పడిపోయింది. భూములు, ప్లాట్ల వ్యాల్యువేషన్​ పెరుగుతున్నా, ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఈ రంగాన్ని నమ్ముకొని కోట్లలో పెట్టుబడులు పెట్టిన వేల మంది రియల్టర్లు దెబ్బతిన్నారు. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు లిక్కర్​ బిజినెస్​వైపు చూస్తున్నారు లిక్కర్​ అమ్మకాల్లోనూ రాష్ట్రం రికార్డులు తిరగ రాస్తున్నది. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయం ఇచ్చే స్థాయికి లిక్కర్​ బిజినెస్​ చేరింది.

పాలమూరు షాపులకు హైదరాబాద్​ రియల్టర్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో లిక్కర్​ సేల్స్​ ఎక్కువ జరుగుతుండడంతో అక్కడి షాపులను దక్కించుకునేందుకు హైదరాబాద్, రంగారెడ్డి​ రియల్టర్లు ఎగబడుతున్నారు. పాత మహబూబ్​నగర్​ జిల్లా పరిధిలో బుధవారం సాయంత్రానికి 228 షాపులకు 1,656 టెండర్లు పడగా, ఇందులో 15శాతం హైదరాబాద్​రియల్టర్లవే ఉన్నట్లు ఆబ్కారీ ఆఫీసర్లు చెప్తున్నారు. లోకల్​రియల్టర్లను కూడా కలుపుకుంటే వీళ్ల వాటా 30శాతం ఉంటుందన్నారు.  ఐదారుగురు రియల్టర్లు సిండికేట్​గా ఏర్పడి 10 నుంచి 12 షాపులకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.  లక్కీ డిప్​లో ఒక్క షాపు తగిలినా జాక్​పాట్​ కొట్టినట్లేనని ఫిక్స్​ అవుతున్నారు. మెదక్​జిల్లాలో 49 వైన్స్​ షాపులకు 485 అప్లికేషన్లు రాగా, ఇందులో దాదాపు 30 మంది రియల్​ఎస్టేట్​ వ్యాపారులే  ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 45 షాపులకు 135 అప్లికేషన్లు వస్తే అందులో 75 మంది రియల్​ ఎస్టేట్​ వ్యాపారులవే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 908 అప్లికేషన్లు రాగా, 40 శాతం మంది రియల్​ వ్యాపారులు ఉన్నట్లు ఆబ్కారీ ఆఫీసర్లు చెప్తున్నారు.  భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 60 షాపులకు ఇప్పటివరకు 55 అప్లికేషన్లు రాగా, సుమారు 14 మంది రియల్ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.  కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాపులకు గాను 741 అప్లికేషన్లు రాగా, వీరిలో 40 శాతం మంది రియల్​ వ్యాపారులే. 

రియల్టర్లపైనే ఆబ్కారోళ్ల ఫోకస్​..

రాష్ట్రంలో లిక్కర్​ షాపుల అప్లికేషన్లు పెంచాలని ఆబ్కారీ శాఖకు  సర్కారు టార్గెట్​ పెట్టింది.  2021తో పోలిస్తే ఈ సారి ఆప్లికే షన్ల సంఖ్య పెంచితే  ప్రతి ఎక్సైజ్​ స్టేషన్ కు  నెలనెలా  స్టేషనరీ ఖర్చుల కింద 25 వేలు ఇస్తామని, ఆఫీసర్లు, ఎస్​హెచ్​వోలు తిరిగేందుకు కొత్త వెహికల్స్ కొనిస్తామని ఆశ పెట్టింది.  పై అధికారుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో అన్ని జిల్లాల్లో ఆబ్కారోళ్లు రియల్టర్లపై పడ్తున్నారు.  ముఖ్యంగా రియల్​ ఎస్టేట్, మైనింగ్​ బిజినెస్​ పెద్ద ఎత్తున జరిగే  హైదరాబాద్, శంషాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కరీంనగర్​, ఉమ్మ డి నల్గొండ జిల్లాలపైనే ఎక్సైజ్ ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​ పెట్టి, రియల్టర్లతో పాటు ఇతర వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రియల్​ వ్యాపారంతో పోలిస్తే లిక్కర్​ దందా బెటర్​ అని ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడి కళ్లముందే సరుకు రూపంలో ఉంటుందని, పర్మిట్​​ రూమ్​లతోనే మంత్లీ ఖర్చులు పూడిపోతాయని నమ్మకం కలిగిస్తున్నారు. ఒక్కసారిషాపు తగిలితే  దశ మారుతుందని భరోసా ఇస్తున్నారు. అందువల్లే పెద్దసంఖ్యలో రియల్టర్లు లిక్కర్​ టెండర్లు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటికే వచ్చిన ఇన్​కం రూ.835 కోట్లు ..

ఈ సారి అప్లికేషన్ల​ రూపంలోనే 2 వేల కోట్లు రాబట్టాలన్నది సర్కార్​ టార్గెట్. రాష్ట్రంలో 2,620 వైన్స్​ షాపులున్నాయి. బుధవారం వరకు 41,754 అప్లికేషన్లు​వచ్చాయి. ఒక్కో అప్లికేషన్​ ఫీజు రూ.2 లక్షలు  ఇప్పటికే సర్కారు​ఖజానాకు రూ.835.8 కోట్ల ఇన్​కం వచ్చింది. ఇప్పటి వరకు 4,232 అప్లికేషన్లతో శంషాబాద్ సర్కిల్​ నంబర్​వన్​ స్థానంలో ఉంది. రెండో ప్లేస్​లో సరూర్​నగర్​(3,832 అప్లికేషన్లు) ఉంది. గడువు మరో రెండు రోజులు ఉండడంతో 80 వేల వరకు అప్లికేషన్స్​ రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

రియల్​ వ్యాపారుల నుంచే ఎక్కువ రెస్పాన్స్​ 

ఈ సారి లిక్కర్​ షాపులకు టెండర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు  పెద్దసంఖ్యలో ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి అప్లికేషన్ల రష్ ఎక్కువగా ఉంది.  కరీంనగర్​ జిల్లాలో  94 షాపులకు  ఇప్పటికే 1,208 అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా రెండు రోజుల గడువు ఉంది.  దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 - తాతాజీ, ఎక్సైజ్ సీఐ, కరీంనగర్ అర్బన్