
- బిజినెస్‌లో నష్టం, పార్ట్నర్ల వేధింపులతో
- రియల్టర్ కుటుంబం ఆత్మహత్య
- భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న వ్యాపారి
- తమ చావుకు ఇద్దరు కారణమంటూ సూసైడ్ నోట్
- నిజామాబాద్‌లోని హోటల్లో ఘటన
నిజామాబాద్/ఆదిలాబాద్, వెలుగు: ఆస్తులన్నీ అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెడితే నష్టం రావడం, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని పార్ట్నర్లు వేధించడంతో రియల్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి నిజామాబాద్‌లో జరిగింది. నిజామాబాద్‌కు చెందిన కొత్తకొండ -కృష్ణ, అనసూయ దంపతులు.. 40 ఏండ్ల కింద ఆదిలాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా, చిన్న కొడుకు సూర్యప్రకాశ్ (37). ఈయన జైనథ్ మండలంలోని దీపాయిగూడకు చెందిన అక్షయ (36)ను పెండ్లి చేసుకున్నారు. వీరికి బిడ్డ ప్రత్యూష (13), కొడుకు అద్వైత్ (7) ఉన్నారు. సూర్యప్రకాశ్ కొన్నేండ్లు ఆదిలాబాద్ లోనే హార్డ్ వేర్ షాప్‌తో పాటు పెట్రోల్ బంక్ నడిపించాడు.
అయితే నాలుగేండ్ల కింద అక్కడి ఆస్తులన్నీ అమ్ముకొని కుటుంబంతో సహా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. లాక్ డౌన్ టైమ్ లో కొన్నిచోట్ల వెంచర్లు వేయగా, పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. దీంతో తాము పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ బిజినెస్ పార్ట్నర్లు ఒత్తిడి తెచ్చారు. అప్పులు చేసి కొంత మొత్తం చెల్లించినా, మిగతావి ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు.
17 రోజులుగా హోటల్లోనే మకాం...
పార్ట్నర్ల వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సూర్యప్రకాశ్.. ఈ నెల 4న కుటుంబంతో సహా నిజామాబాద్ కు వచ్చి ప్రైవేట్ హోటల్ లో దిగాడు. అప్పటి నుంచి కుటుంబంతో అందులోనే ఉంటున్నాడు. రెండు, మూడ్రోజుల కింద నిజామాబాద్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఈ క్రమంలో సూర్యప్రకాశ్ శనివారం రాత్రి 8 గంటలకు భార్య, పిల్లలకు కేక్‌లో విషం కలిపి తినిపించాడు. వాళ్లందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక హోటల్ రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్‌కు తానూ ఉరేసుకున్నాడు. ఆదివారం రూమ్ లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. కాలింగ్బెల్కొట్టినా, ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి డోర్ తెరిచి చూడగా అందరూ చనిపోయి కనిపించారు. కాగా, సూర్యప్రకాశ్ దగ్గర సూసైడ్‌నోట్ దొరికింది. తన రియల్ఎస్టేట్ వ్యాపారంలో పార్టనర్లుగా ఉన్న కిరణ్‌కుమార్, వెంకట్ అనే ఇద్దరు వ్యక్తుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో ఉంది. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.
- అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
- భార్య, ఇద్దరు పిల్లలతో పాటు గడ్డి మందు తాగిన జ్యువెలరీ వ్యాపారి
- తండ్రి, బిడ్డ పరిస్థితి సీరియస్.. జగిత్యాలలో ఘటన
- హైదరాబాద్‌లోని నిమ్స్‌కు నలుగురి తరలింపు
జగిత్యాల, వెలుగు: అప్పుల బాధతో జ్యువెలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం జగిత్యాలలో జరిగింది. జిల్లా కేంద్రంలోని సంతోష్ నగర్ కు చెందిన ఆపోజి కృష్ణమూర్తి (40) టవర్ సర్కిల్ లో చిన్న జ్యువెలరీ షాప్ నడిపిస్తున్నాడు. ఈయనకు భార్య శైలజ(35), కొడుకు అశ్రిత్ (15), బిడ్డ గాయత్రి (14) ఉన్నారు. అశ్రిత్ పదో తరగతి చదువుతుండగా, గాయత్రి తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే బిజినెస్ సరిగ్గా నడవక కృష్ణమూర్తి అప్పుల పాలయ్యాడు. దాదాపు రూ.25- లక్షల వరకు అప్పు చేశాడు. కొంతకాలంగా అప్పులోళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో శనివారం అర్ధరాత్రి దాటినంక కుటుంబ సభ్యులంతా కలిసి గడ్డి మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో చుట్టుపక్కలోళ్లు వెళ్లి చూశారు. వెంటనే నలుగురిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బాధితులందరినీ హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. తల్లి, కొడుకు పరిస్థితి నిలకడగా ఉండగా.. తండ్రి, బిడ్డ పరిస్థితి సీరియస్ గా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కిశోర్ చెప్పారు.