
న్యూఢిల్లీ:మనదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది స్వీట్న్యూస్! 2024-–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు 6.01 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. దీని ప్రకారం.. 2023–-24లో 778.1 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.64,961.35 లక్షల కోట్లు) ఉన్న ఎగుమతులు, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 824.9 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.68,884.15 లక్షల కోట్లు)పెరిగాయి.
సేవల రంగం వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది. 2024-–25లో సేవల ఎగుమతులు 13.6 శాతం పెరిగి 387.5 బిలియన్ డాలర్లకు (రూ.32,356.25 లక్షల కోట్లు)చేరాయి. ముఖ్యంగా ఐటీ, వ్యాపార సేవలు, ఆర్థిక సేవలు వంటి రంగాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. మార్చి 2025లో ఒక్క నెలలోనే సేవల ఎగుమతులు 18.6 శాతం పెరిగి 35.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ముఖ్యంగా ఐటీ ఐటీ ఆధారిత సేవలు, వ్యాపార సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ టెలికాం వంటి రంగాలు మంచి వృద్ధిని సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ వల్ల భారతీయ ఐటీ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులను మినహాయించి చూస్తే, వస్తువుల ఎగుమతులు కూడా ఆరుశాతం పెరిగి 374.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది కూడా ఒక రికార్డే. గత నెల మనదేశం నుంచి వస్తువుల ఎగుమతులు ఏడాది లెక్కన 0.7 శాతం పెరిగి 41.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2025 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వస్తువుల ఎగుమతుల విలువ ఏడాది లెక్కన 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సవాళ్లను అధిగమించి..
అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను తట్టుకుని భారతదేశం తన ఎగుమతుల్లో ఈ స్థాయిలో వృద్ధి సాధించడం విశేషమని ఎకనమిస్టులు అంటున్నారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ మన ఎగుమతులు రికార్డుస్థాయికి చేరుకున్నాయని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్భర్త్వాల్పేర్కొన్నారు.
మనదేశ వాణిజ్యలోటు 2025 సంవత్సరంలో 282.82 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని విలువ 241.14 బిలియన్ డాలర్లు ఉంది. భారతదేశం తన ఎగుమతులను మరింతగా విస్తరించుకోవడానికి అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఎగుమతులను ప్రోత్సహించడానికి అనేక పథకాలను, విధానాలను అమలు చేస్తోంది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) వంటివి దేశీయ ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడానికి సహాయపడుతున్నాయి. భారతదేశం తన ఎగుమతులను కేవలం కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై దృష్టి సారించడం వల్ల ఎగుమతుల పరిధి పెరుగుతోంది.