ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్స్ లేక ఆఫీసర్ల తిప్పలు

ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్స్ లేక ఆఫీసర్ల తిప్పలు
  • పోడు సర్వేలో సమస్యలెన్నో!
  • ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్స్ లేక ఆఫీసర్ల తిప్పలు
  • ఫారెస్ట్ యాప్ ఆప్షన్లతో అనేక ఇబ్బందులు
  • రెండు చోట్ల భూమి ఉన్నా ఒక చోటే వివరాల నమోదు
  • ఉమ్మడి జిల్లాలో మందకోడి సాగుతున్న ఆర్వోఎఫ్ఆర్ సర్వే

మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల పంపిణీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వేకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించడం క్షేత్రస్థాయిలో సవాలుగా మారింది. ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్స్ లేక ఆఫీసర్లు తిప్పలు పడుతుండగా.. కొన్ని నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. మరోవైపు ప్రభుత్వం రూపొందించిన ఫారెస్ట్ యాప్ లోని ఆప్షన్లు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఇదీ సంగతి..

పోడు భూముల పట్టాల పంపిణీకి ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 140 జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, అటవీ, రెవెన్యూ, భూకొలతల ఆఫీసర్లు పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. భూములను గుర్తించి, అటవీశాఖ ఉపగ్రహ చిత్రాలతో సరిపోల్చుతారు. 2005 డిసెంబర్ 13వ తేదీ కన్నా ముందు నుంచి పోడు సాగు చేసుకున్నట్లు అయితే పట్టాలు జారీ చేస్తారు. లేదంటే రిజెక్ట్ చేస్తారు. అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేసే క్రమంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

సిగ్నల్స్ లేక నత్తనడకన సర్వే..

అటవీ భూములు, పోడు భూములు గుర్తించే క్రమంలో ఆఫీసర్లకు సిగ్నల్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల సిగ్నల్స్ లేకపోవడంతో టీఎస్ ఫారెస్ట్ యాప్ లో వివరాలను నమోదు చేయలేకపోతున్నారు. సిగ్నల్స్ లేని చోట సర్వే చేసిన అనంతరం సిగ్నల్స్ ఉన్న చోటుకు వెళ్లి వివరాలను అప్ లోడ్ చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఫెయిల్ అయితే మళ్లీ మొదటి నుంచి సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పంట పొలాలు, చేన్ల నుంచి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. సరౌండింగ్స్, కార్నర్ పాయింట్స్ గుర్తించలేకపోతున్నారు. తద్వారా లాటిట్యూడ్, లాంగిట్యూట్ ను గుర్తించడం కష్టతరమవుతోంది. రోజూ ఐదారు భూముల కంటే ఎక్కువ వివరాలు ఎంట్రీ చేయలేకపోతున్నారు.

యాప్ కష్టాలు..

పంచాయతీ ఆఫీసర్ల వద్ద ఉన్న ఆఫ్ లైన్ ఆర్వోఎఫ్ఆర్ వివరాలకు, ఫారెస్ట్ ఆఫీసర్ల వద్ద ఉన్న టీఎస్ ఫారెస్ట్ యాప్ కు మధ్య డాటా వ్యత్యాసం ఏర్పడుతోంది. ఒక పోడు రైతుకు రెండు, మూడు చోట్ల పోడు భూమి ఉన్నప్పటికీ అతని పేరుపై ఒక్క చోట మాత్రమే భూమి వివరాలను సేకరిస్తున్నారు. మరోచోట ఉన్న భూమిని యాప్ లో ఎక్కిస్తే.. రిజక్ట్ అవుతోంది. రెండోసారి పేరు ఎంట్రీకి కూడా ఆప్షన్ ఇవ్వడం లేదు. దీంతో  పోడు  రైతులు ఆందోళన చెందుతున్నారు.

సిబ్బంది కొరత..

వీఆర్ఎల సమ్మె కారణంగా పోడు భూముల సర్వే ఇబ్బందికరంగా మారిందని పలువురు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయి సర్వేలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి, భూకొలతలు, అటవీ, రెవెన్యూ ఆఫీసర్లు ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉంది. వాస్తవానికి మండలాల్లో ఒకరిద్దరు ఆర్ఐలు మాత్రమే ఉన్నారు. వీరు రోజుకు ఒకటి, రెండు గ్రామాలకు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్వోఎఫ్ఆర్ సర్వేకు మరింత టైం పట్టే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలు(సుమారుగా)

జిల్లా    దరఖాస్తులు    పోడు భూములు
భూపాలపల్లి     25,021    63,077
వరంగల్‌    7,711    9,968
ములుగు    34,044    91,843 
మహబూబాబాద్‌    32,697    1,15,948

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం. సర్వే నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. టెక్నికల్ ​అంశాలను, సమస్యలను రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు నివేదిస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. 

-శశాంక, కలెక్టర్, మహబూబాబాద్​

భూమి మొత్తం సర్వే చేయట్లే..

నాకు నాలుగు చోట్ల నాలుగు ఎకరాల పోడు భూమి ఉంది. ఆఫీసర్లు మాత్రం ఒక్క చోట ఉన్న భూమిని మాత్రమే సర్వే చేశారు. మిగిలిన మూడు చోట్ల ఉన్న భూమి సంగతేంటని ప్రశ్నిస్తే.. యాప్ లో ఆప్షన్ లేదని మళ్లీ వస్తామని చెప్తున్నరు. నా భూమి మొత్తానికి హక్కు పత్రాలు అందేలా చర్యలు చేపట్టాలి.

- సిద్దబోయిన లక్ష్మీనారాయణ, పోడు రైతు, గాంధినగర్, కొత్తగూడ