టార్గెట్ చేరని రిజిస్ట్రేషన్ల ఇన్​ కం 

టార్గెట్ చేరని రిజిస్ట్రేషన్ల ఇన్​ కం 

కరీంనగర్, వెలుగు:  ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గాయి. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 8,23,479 రిజిస్ట్రేషన్లు జరగగా, 2022–-23లో  అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య7,39,019కు పడిపోయింది. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లకు సంబంధించిన నాన్ అగ్రికల్చర్ అసెట్స్ అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సర్కార్ ఆశించిన స్థాయిలో జరగలేదు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది జరిగిన రిజిస్ట్రేషన్లలో పెద్దగా పెరుగుదల లేదు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15,600 కోట్లు ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే  రూ.14,285 కోట్లు మాత్రమే సమకూరింది. గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గడం, రెండేళ్ల క్రితం ధరలతో పోలిస్తే ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, ఇళ్ల ధరలు అమాంతం పెరగడంతోపాటు నాన్ లేఔట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల పార్టిషియన్ పై  సర్కార్ విధించిన నిబంధనలతో కూడా రిజిస్ట్రేషన్లు  తగ్గాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

19.43 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం 2021– 22 ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచిన విషయం తెలిసిందే. అయినా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం సర్కార్ ఆశించినంత స్థాయిలో పెరగలేదు. రాష్ట్ర ఖజానాకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2021–22లో రూ.12,500 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని టార్గెట్​ పెట్టుకోగా రూ.12,364 కోట్ల వరకు సమకూరింది. ఆ సంవత్సరం ప్రభుత్వం  మార్కెట్ వాల్యూను సవరించడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడంతో సర్కార్​ టార్గెట్​ రీచ్​ అయ్యింది. 2022–-23లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అదనంగా  రూ.1,921 కోట్ల ఇన్ కం వచ్చినప్పటికీ.. టార్గెట్ పరంగా చూస్తే రూ.1,315 కోట్లు తక్కువగా వచ్చింది. నిరుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించి 12,04,378 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా, ధరణి ద్వారా  7,39,019 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

తొమ్మిదేళ్లలో ఐదింతలైన ఆదాయం 

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే తొమ్మిదేళ్లలో ఐదింతలైంది. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి  రూ.2,707 కోట్ల ఆదాయం వస్తే 2022–-23కు వచ్చేసరికి రూ.14 వేల కోట్లకు చేరింది. 2015-–16లో రూ.3,786 కోట్ల ఆదాయం రాగా,  2016–-17లో 4,249 కోట్లు,  2017–-18లో  రూ.5,177  కోట్లు, 2018–-19లో 6,612 కోట్లు, 2019–-20 సంవత్సరంలో 7,061 కోట్ల ఆదాయం సమకూరింది.  2020–21లో కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఆ సంవత్సరం భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఒక్కసారిగా రూ.5,260 కోట్లకు పడిపోయింది. తర్వాత సంవత్సరం ల్యాండ్ వాల్యూను రెండు సార్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఒకసారి పెంచడంతో 2021–22లో రిజిస్ట్రేషన్ల ఆదాయం డబుల్ అయింది. ఆ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.రూ.14,285 కోట్లకు చేరింది. 

సర్కార్ నిబంధనలే అడ్డంకి 

పంచాయతీ, నాన్​లేఔట్​ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో సర్కార్ రెండేళ్ల క్రితం విధించిన షరతులతోనే లావాదేవీలు మందగించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  పెద్ద సైజు ప్లాట్లను రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్లాట్లుగా పార్టీషియన్ చేయడానికి వీల్లేకపోవడంతో ఇలాంటి ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. అలాగే వారసులు లేదా ఇతర పార్ట్ నర్స్  కూడా ఎవరి వాటా స్థలాన్ని వారు పార్టిషియన్ చేసుకోవడం  కుదరడం లేదు. ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయాలంటే గతంలో ఒకసారైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీంతో గతంలో నాన్ లేఔట్ ప్లాట్లలో రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయిన ప్లాట్లు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావడం లేదు. అలాగే ఇంటి నంబర్లతోనూ గతంలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎల్ఆర్ఎస్​చేయదగిన నాన్​లేఔట్ ప్లాట్లు, గ్రామకంఠంలోని స్థలాలు, నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్లు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. 

ఆర్నెళ్లుగా రియల్ ఎస్టేట్ డల్ అయ్యింది 


గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది.  కరోనాకు ముందుతో పోలిస్తే  ప్లాట్లు, ఇళ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. అనుకున్న బడ్జెట్ లో ప్లాట్లు, ఇళ్లు దొరక్క చాలామంది వారి ప్లాన్ వాయిదా వేసుకుంటున్నారు. నాన్ లేఔట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల పార్టిషియన్ పై ఉన్న నిబంధనలతో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గ్రామాల్లో గతంలోలాగా రైతులు తమ భూములు అమ్మడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ భూములు అమ్మే వాళ్ల సంఖ్య కూడా తగ్గింది.

  
– నీలం మల్లారెడ్డి,  రియల్ ఎస్టేట్ వ్యాపారి