మంగళసూత్రం తీసేయడమంటే భర్తను మానసికంగా హింసించడమే..

మంగళసూత్రం తీసేయడమంటే భర్తను మానసికంగా హింసించడమే..

భర్త నుంచి విడిపోయిన భార్య తన మెడలోని మంగళసూత్రాన్ని తీసేయడమంటే.. భర్తను మానసిక క్షోభకు గురిచేసినట్టేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను ఈ విధంగా మానసికంగా బాధపెట్టినందుకు గానూ... అతను కోరినట్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఓ విడాకుల కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీఎం వేలుమణి, జస్టిస్ ఎస్ సౌంథర్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీకగా అభివర్ణించిన కోర్టు... భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలని పేర్కొంది. ఒకవేళ భార్య, భర్తనుంచి విడిపోవాలనుకుంటే.. భార్య ముందుగానే తాళిని తీసివేయరాదని తెలిపింది. అలా అగ్ని సాక్షిగా మనువాడిన భర్త బతికుండగానే.. భార్య తాళిని తీసివేయడం అంటే భర్తకు తీరని ఆవేదనను మిగిల్చినట్టేనని వ్యాఖ్యానించింది.   

ఇటీవల తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌ అనే వ్యక్తికి విడాకులు ఇచ్చేందుకు స్థానిక ఫ్యామిలీ కోర్టు నిరాకరిస్తూ తీర్పు చెప్పడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2016 జూన్ 15 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. భర్త నుంచి విడిపోయే సమయంలో.. తన తాళిని తొలగించినట్లు  అతని భార్య కోర్టు  ధర్మాసనం ఎదుట అంగీకరించింది. అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 7ను ఆమె తరపు న్యాయవాది ప్రస్తావించారు. తాళి కట్టడం అవసరమైనదే కాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మన దేశంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని తెలిపింది.  హిందూ వివాహిత తన జీవితకాలంలో ఏ సమయంలోనూ భర్త బతికుండగా తాళిని తీసేందుకు సాహసించదని, కానీ ఆమె తన తాళిని తీసినట్టు స్వయంగా అంగీకరించిందని చెప్పింది. తాళిని బ్యాంక్ లాకర్‌లో పెట్టానని ఆమె పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.    

స్త్రీ మెడలో తాళి ఉండడం అనేది పవిత్రమైన విషయమని, ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుందని కోర్టు పేర్కొంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగిస్తారని, దీన్నిబట్టి ఆమె చర్యను భర్తను మానసికంగా హింసించే చర్యగా చెప్పొచ్చని వ్యాఖ్యానించింది. ఇది అత్యున్నత స్థాయి మానసిక క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుందని  స్పష్టం చేసిన కోర్టు... శివ కుమార్ కు విడాకులు మంజూరు చేసింది.