
- నడుములు పోతున్నయ్.. బండ్లు ఖరాబైతున్నయ్..
- రంబుల్ స్ట్రిప్స్ తీసెయ్యండి
- ట్విట్టర్లో మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీకి విజ్ఞప్తులు
- ఫ్లై ఓవర్లు, ప్రధాన జంక్షన్లలో ఇంచు ఎత్తులో స్ట్రిప్స్
- అమెరికా వంటి దేశాల్లో అర ఇంచుతోనే స్ట్రిప్స్
- బండ్లు, కార్ల పాడై వాహనదారుల జేబులకు చిల్లు
- ప్రెగ్నెంట్లు, దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు : రంబుల్ స్ట్రిప్స్.. రయ్యిన దూసుకెళ్లే బండ్లకు కళ్లెం వేసేందుకు, ప్రమాదాలను తగ్గించేందుకు హైదరాబాద్ రోడ్ల మీద వేసిన మినీ స్పీడ్ బ్రేకర్లివి. ఉద్దేశం మంచిదే అయినా.. వాటితో జనం గోసపడుతున్నరు. స్పీడు తగ్గుడేమో గానీ.. ఒళ్లు గుల్ల అయిపోతున్నది.. బండ్లు ఖరాబైతున్నయ్... మామూలు రోడ్ల నుంచి ఫ్లై ఓవర్ల దాకా సిటీ మొత్తం ఇదే సమస్య. అంగుళం ఎత్తుతో స్ట్రిప్స్ వేయడం వల్ల వేగంగా వెళ్లే బైకులు షేక్ అయిపోయి.. వాటిని నడిపేవారి గుండెలు బయటకొచ్చినంత పనైతున్నది.
వెన్నుపూసలు వణికిపోతున్నాయి. మరీ ముఖ్యంగా బైక్స్, స్కూటర్స్ నడిపే గర్భిణులు, దివ్యాంగులకు రంబుల్ స్ట్రిప్స్ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బండిని ఎంత స్లో చేసినా.. రంబుల్ స్ట్రిప్స్ ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల వాహనదారుల బాడీపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో కొన్ని స్కూటర్స్, బైక్స్ స్కిడ్ అవుతున్నాయి. బాడీనే కాదు.. బండ్లు, కార్ల సస్పెన్షన్లు ఖరాబయ్యి వాటి రిపేర్లకు వేలకు వేలు ఖర్చవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని రోడ్లపై నుంచి రంబుల్ స్ట్రిప్స్‌ను తీసెయ్యాలని డిమాండ్చేస్తున్నారు. ఈ పోస్టులను మంత్రి కేటీఆర్‌కూ ట్యాగ్ చేస్తున్నారు. రంబుల్ స్ట్రిప్స్ స్థానంలో ఒకట్రెండు స్పీడ్ బ్రేకర్లు వేసినా నష్టం లేదని, స్పీడ్‌ను తగ్గించేందుకు ఇతర మార్గాలను చూడాలని సూచిస్తున్నారు. సిటీలోని ఫ్లై ఓవర్ల పైనుంచి వెళ్లడం కన్నా గుంతల రోడ్డు మీద వెళ్లడమే నయమని అంటున్నారు.
హైవేల మీద పెట్టాల్సిన స్ట్రిప్స్..
రంబుల్ స్ట్రిప్స్ హైవేల మీద ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న వెహికల్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఉద్దేశించినవి. ఇప్పటికే హైవేల మీద ఈ తెల్లటి చారల స్ట్రిప్స్ వేశారు. వెహికల్స్ రద్దీ, వేగం బాగా పెరిగినందున సిటీలోనూ వీటిని వేస్తున్నారు. మూడేండ్ల కిందట వేగంతో దూసుకొచ్చిన కారు బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఓ మహిళ చనిపోయింది. ఫ్లై ఓవర్‌ను ఓపెన్ చేసిన కొన్నాళ్లకే ఈ ప్రమాదం జరగడం.. అప్పటికి మూల మలుపుల్లో ఎలాంటి సైన్ బోర్డ్స్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రమాదాలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు, ఫ్లై ఓవర్లపై రంబుల్ స్ట్రిప్స్ వేసే ఐడియాను అమలు చేస్తున్నారు.
పావు కిలోమీటరు డిస్టెన్స్‌లో నాలుగైదు చోట్ల..
రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసే క్రమంలో శాస్త్రీయత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో ఎత్తులో ఉంటుండడం.. వాటిపై జనానికి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల తక్కువ ఎత్తుతో ఐదారు రంబుల్ స్ట్రిప్స్ వేస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కువ ఎత్తుతో పదికిపైగా రంబుల్ స్ట్రిప్స్‌ను వేస్తున్నారు. ఇటీవలే ప్రారంభించిన నాగోల్ ఫ్లై ఓవర్‌నే తీసుకుంటే.. దాని స్టార్టింగ్, ఎండింగ్లలో ఒకేచోట పదిహేను వరకు స్ట్రిప్స్‌ను వేశారు. కేవలం పావు కిలోమీటరు డిస్టెన్స్లోపల నాలుగైదు చోట్ల రంబుల్స్ట్రిప్స్ను వేయడం వల్ల వాహనదారులు ఇబ్బందిపడుతున్నరు. ఇది ఒక్క నాగోల్ ఫ్లైఓవర్కే పరిమితమైపోలేదు. నగరంలో చాలాచోట్ల వాటిని ఏర్పాటు చేశారు.
బైకులే కాదు.. బస్సులు, కార్లలో వెళ్లినా..
రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశమున్న మూల మలుపులు, జంక్షన్లు, యూ టర్న్‌లకు సమీపంలో మాత్రమే రంబుల్ స్ట్రిప్స్‌ను వేయాల్సి ఉన్నా.. ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి స్ట్రిప్స్ మీద నుంచి వెళ్తే ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బైక్స్, స్కూటర్స్ నడిపే వారికి వెన్నుపూస, డిస్క్వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు. బస్సులో వెళ్లినా, కార్లో వెళ్లినా రంబుల్ స్ట్రిప్స్ వల్ల ఏర్పడే వైబ్రేషన్ తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. దీనివల్లే తన కారు సస్పెన్షన్ పాడైపోయి రూ.60 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఓ బాధితుడు వాపోయాడు.
అమెరికాలో రంబుల్ స్ట్రిప్స్ వేయడం ఆపేశారు
రోడ్డును కొద్దిగా తవ్వి సిమెంట్‌తో రంబుల్ స్ట్రిప్స్ అచ్చుపోస్తుంటారు. లేదంటే రోడ్డు మీదే వైట్ పెయింట్‌తో నేరుగా స్ట్రిప్స్ వేస్తారు. అమెరికా వంటి దేశాల్లో రంబుల్ స్ట్రిప్స్ ఎత్తు పావు ఇంచు నుంచి అర ఇంచులోపే ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఇక వెడల్పునూ 2 నుంచి 12 అంగుళాల వరకే ఫిక్స్ చేశారు. అమెరికాలో హైవేల మీదే వాటిని ఏర్పాటు చేస్తుంటారు. గతంలో సిటీల లోపల రంబుల్ స్ట్రిప్స్ వేసినప్పుడు..అక్కడి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. దీంతో అమెరికాలో సిటీల లోపల, రెసిడెన్షియల్ ఏరియాలకు దగ్గర్లో వాటిని వేయడం ఆపేశారు.