జమ్మూకాశ్మీర్‌‌‌‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

జమ్మూకాశ్మీర్‌‌‌‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  •     మూడ్రోజులు గడిచినా ఇంకా తెలియని 82 మంది ఆచూకీ 
  •     తమవారి కోసం తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌‌‌ కిష్ట్వార్ జిల్లాలో వరదలకు గల్లంతైన 82 మంది ఆచూకీ కోసం మూడో రోజు శనివారం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. పోలీసులు, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్టీఆర్ఎఫ్), బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), స్థానిక స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలను, మనుషులను గుర్తించడానికి స్నిఫర్ డాగ్‌‌‌‌లను ఉపయోగిస్తున్నారు.

అయినప్పటికీ, బురద, వర్షాలు, దెబ్బతిన్న రోడ్ల వల్ల రెస్క్యూ పనులు ఆలస్యం అవుతున్నాయి. అయితే, మూడ్రోజులు గడిచినా ఇంకా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో తప్పిపోయినవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గంటగంటకూ తమ వారు బతికే ఉండి ఉంటారనే ఆశలు సన్నగిల్లుతున్నాయని వాపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శకు వస్తుండటంతో  రెస్క్యూ పనులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటన

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం వరద బాధిత చోసిటీ గ్రామంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒమర్ అబ్దుల్లా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్ప గాయాలతో బాధపడుతున్న వారికి రూ. 50 వేలు ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, మొత్తం కూలిపోయిన ఇండ్లకు రూ. లక్ష, తీవ్రంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 25 వేలు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.