అరకొర జీతాలతో ఆర్పీల వెతలు

అరకొర జీతాలతో ఆర్పీల వెతలు
  •    రాష్ట్రంలో 6 వేల మంది రిసోర్స్ పర్సన్లు
  •     సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్
  •     ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించాలని వేడుకోలు

మంచిర్యాల, వెలుగు : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నారు. సుమారు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనం, గుర్తింపు, ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. తమ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ సర్కార్ ను ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

రూ. 6 వేల వేతనంతో అవస్థలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి 6 వేల మంది మహిళలు రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళకు పొదుపు అలవాట్లను నేర్పడం, బ్యాంకులు, స్త్రీనిధి నుంచి లోన్లు ఇప్పించడం, వాటిని రికవరీ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రభుత్వ మీటింగులకు మహిళలను సమీకరించడం, ప్రభుత్వానికి అవసరమైన సర్వేలు చేయడంలో వీరి పాత్ర కీలకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో వీరికి రూ.4 వేల గౌరవ వేతనం అమలు చేసింది. తర్వాత మరో రూ.2 వేలు పెంచుతూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో విడుదల చేసింది. అయితే ఆ రూ. 6  వేలు కూడా సక్రమంగా అందకపోవడంతో ఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సమస్యలు పరిష్కరించాలని ప్రజాభవన్ లో వినతులు

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్పీలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా నెలకు కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలని,   వేతనాలను స్త్రీనిధి నుంచి కాకుండా ప్రభుత్వపరంగా బడ్జెట్ కేటాయించి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డ్రెస్ కోడ్, జాబ్ చార్ట్ అమలు చేయాలని, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అలాగే ఈ నెల 13న వివిధ జిల్లాల నుంచి 3 వేల మందికిపైగా ఆర్పీలు హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు వచ్చి 3 వేల అప్లికేషన్లను అందజేశారు.

రూ.20 వేల జీతం ఇవ్వాలి 

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ. 6 వేల గౌరవ వేతనం ప్రయాణ ఖర్చులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి. ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలి.

మానుకోట సునీత, 
ఆర్పీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు