ఫలితాలు పార్టీలకు గుణపాఠాలు : డా.పి. భాస్కర యోగి,సోషల్​ ఎనలిస్ట్​

ఫలితాలు పార్టీలకు గుణపాఠాలు : డా.పి. భాస్కర యోగి,సోషల్​ ఎనలిస్ట్​

తెలంగాణలో ఓట్ల పండుగ ముగిసింది. ప్రలోభాలు, తాయిలాలు, ఎన్నికల మేనేజ్​మెంట్​ వంటి ఎన్ని వ్యూహాలు పార్టీలు పన్నినా ప్రజాతీర్పులో స్పష్టత ఉంది. బండి సంజయ్​ ఓడిపోవడం, మల్లారెడ్డిలాంటివారు గెలవడం వంటి ఘటనలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. మొత్తానికి ప్రజల తీర్పులో స్పష్టత ఉంది. తెలంగాణ కాంగ్రెస్​ విజయం దేశం మొత్తం మీద ఆ పార్టీకి గొప్ప ఊరట. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మూడు పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఘోర పరాజయం చవిచూసింది. ఒకప్పుడు ఇందిరాగాంధీని దేశమంతా తిరస్కరించినా అప్పుడు ఆంధ్రప్రదేశ్​ ఆదుకుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్​రెడ్డి రూపంలో కాంగ్రెస్ బట్టగట్టింది. దక్షిణాదిలో నాయకుల ఆధారంగా పాలిటిక్స్ నడుస్తాయని తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. కరుణానిధి, జయలలిత, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్,  వైఎస్ఆర్, యడియూరప్ప, బండి సంజయ్, రేవంత్​రెడ్డి..ఇలా దక్షిణ ప్రాంతం వ్యక్తులపై భరోసా ఉంచిందని చరిత్ర చెప్పిన సాక్ష్యం.  జాతీయ పార్టీగా కాంగ్రెస్​ ఫక్తు ప్రాంతీయ పార్టీలాగా వ్యవహరించకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ నిట్టనిలువుగా కూలిపోయింది. బిహార్, బెంగాల్, యూపీ, తమిళనాడు, ఒడిస్సాలాంటి రాష్ట్రాల్లో  అధికారానికి దూరంగా ఉంది.  ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ ఫ్లేవర్​ ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయం చేయడం జాతీయ పార్టీలకు సాధ్యంకాదు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న తప్పు ఇదే.  తెలంగాణ రావడంలో బలిదానాలు, పోరాటాలు, కేసీఆర్​ దీక్షలు, కాంగ్రెస్–బీజేపీల సహకారం ప్రజలు బాగా గుర్తుపెట్టుకొన్నారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరాకుమార్​లపై ఇక్కడి ప్రజలకు కృతజ్ఞత ఉంది. అందుకే  కేసీఆర్​కు రెండు పర్యాయాలు, బీజేపీ గట్టిగా నిలబడిన ప్రతిసారి తెలంగాణ వెన్నుదన్నుగా నిలబడింది. ఇప్పుడు మార్పు కోరుతూ కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టారు. అయితే ఇందులో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ.

కేసీఆర్​ ఇష్టారాజ్యం

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ మొదట తెలంగాణ విషయంలో నిబద్ధతనే ప్రదర్శించాడు. ఆ తర్వాత తనకు వ్యతిరేకం అనుకున్నవాళ్లను పాతాళంలోకి తొక్కడం, తనకు నచ్చినవారిని అందలం ఎక్కించడం మొదలుపెట్టాడు. ముస్లిం ఓట్ల కోసం మజ్లిస్​ పార్టీతో మితిమీరిన సహవాసం చేస్తూ దాన్ని ‘గంగా జమునా తహెజీబ్’ అన్నాడు. దీనికి అంత:పురంలోని ‘లెఫ్ట్​వింగ్’ ఇంటలెక్చువల్స్ గానాభజన ఊదడం మొదలుపెట్టారు. అలాగే  మిషన్​ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం వంటి వాటిలో ప్రధాన లోపాలు గుర్తించకుండా ఏకపక్షంగా కేసీఆర్​ ప్రభుత్వం వ్యవహరించిందని ప్రజలు భావించారు. రియల్టర్ల పొలాలకు కూడా రైతుబంధు ఇవ్వడం నిజమైన రైతులు హర్షించలేదు. అలాగే కౌలు రైతులను గుర్తించాల్సింది పోయి ధరణి పేరిట రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అవసరం లేకుండా అశాస్త్రీయంగా జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడం కేసీఆర్​ చేసిన పెద్ద తప్పుగా చాలామంది అనుకున్నారు. పాత పది జిల్లాలను ఒక్కోటి రెండు జిల్లాలు చేస్తే సరిపోయేది. అలాకాకుండా తమకు నచ్చినట్లు చేయడం వల్ల ప్రజలు ఇదంతా దుబారా అని భావించారు. అలాగే బీసీ బంధు, దళితబంధు స్కీములు గతంలో చంద్రబాబు ఆడపిల్లలకు సైకిల్​ కొనిచ్చిన స్కీమ్​గా మారిపోయింది. దానివల్ల దళితులకు, ప్రభుత్వానికి ఇద్దరికీ మేలు కలుగకపోగా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ప్రజల క్షేమం కన్నా పాలాభిషేకాలే ముఖ్యమైనయి

 రెండవ దఫా కేసీఆర్  ​ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగాయనీ, వ్యాపారాల్లో హద్దులు మీరి తలదూర్చడం, అన్నీ కేసీఆర్​ చూస్తాడని చెప్పడం, ప్రతిపక్షాలపై, ప్రత్యర్థులపై కక్షసాధింపులు, వాళ్ల వ్యాపారాలు దెబ్బతీయడం, కేసులు పెట్టడం వంటి దుశ్చర్యలు ఎక్కువయ్యాయని కేసీఆర్​ గుర్తించలేదు. గుర్తించినా ప్రత్యర్థులపైకి ఉసిగొల్పడం ప్రజలు హర్షించలేదు. అలాగే కేటీఆర్, హరీశ్​ ప్రతిపక్షాలను ప్రాసలతో ఇష్టంవచ్చినట్లు దూషించడం ప్రజలు హర్షించలేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా మాట్లాడడం తెలంగాణ సంస్కృతి కాదన్న విషయం కేసీఆర్​కు ఎవరూ చెప్పలేకపోయారు. మేం మాత్రమే తెలంగాణ టేకేదార్లం అన్న తీవ్రత బీఆర్ఎస్​ కొంపముంచింది. ఉద్యమంలో నమ్మి నిలబడిన ఉద్యోగ, ఉపాధ్యాయులను కొందరు యూనియన్​ నేతలను వెంబడి పెట్టుకుని కిందిస్థాయివారికి హాని కలిగించారు. పాలాభిషేకం చేసేవాళ్లను  కార్యకర్తలు అనుకున్నారు. తెలంగాణ బాగు కోరే వాళ్లను శత్రువులు అనుకున్నారు! ఏది జరిగినా తన కోసమే జరగాలె తప్ప తెలంగాణ కోసం జరగాలనే యావ  కేసీఆర్​లో ఏ కోశానా లేని ధోరణే ఇవాళ ఆయన్ను అధికారం నుంచి దింపేసింది.

కేసీఆర్​కు సమ ఉజ్జీగా రేవంత్​

అతిని, అహంకారాన్ని ప్రజలు భరించలేకపోయారు అన్న విషయం కేసీఆర్​ అండ్ కో ఇప్పటికైనా గ్రహించాలి. దీనికి రివర్స్​గా  రేవంత్​రెడ్డి తనను తాను కేసీఆర్​కు సమ ఉజ్జీగా నిరూపించుకున్నాడు. బండి సంజయ్ అప్పటికే పెంచిన హీట్​ రేవంత్​కు బాగా ఉపయోగపడింది. 2018లో రేవంత్​ ఈ పని చేసేవాడు కానీ కాంగ్రెస్​ జాతీయ ప్రయోజనాలు అంటూ చంద్రబాబును తెచ్చుకోవడం వల్ల కేసీఆర్​నెత్తిన పాలు పోసినట్లయింది. గత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్​ రెండోసారి సీఎం కాగలిగాడు.  కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఏడు పనులు నిర్విఘ్నంగా చేశాడు. రోజూ కంట్లో నలుసులాగా ఉండే వృద్ధ నేతల కట్టడికోసం పొన్నాల, నాగంలాంటి వారిని పొమ్మనకుండా పొగబెట్టి పంపించాడు. దాంతో ఇష్టారీతిగా మాట్లాడే వీహెచ్, పోటీలుపడే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వంటివారు దారికొచ్చారు. డీకే శివకుమార్​తో మాట్లాడి కేంద్రాన్ని తన దారికి తెచ్చుకున్నాడు. ఇది రెండో పని. మజ్లిస్​ లేకుండా ముస్లిం ఓట్లను వచ్చినంత పొందేందుకు కావాల్సిన వ్యూహం. దానికి సమానంగా రెడ్డి ఓటు బ్యాంక్​ కన్సల్టేషన్​ చేశాడు. ఇక ఎప్పటికప్పుడు తోక ఆడిస్తూ తామే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కింగ్​మేకర్​లుగా ఫోజులిచ్చే కమ్యూనిస్టులకు ఒక్క సీటు సీపీఐకి ఇచ్చి సీపీఎంను ఎటూగాకుండా చేశాడు. మరోవైపు ఆకర్షణీయ సోషల్ మీడియా స్లోగన్స్​ బాగుండటం, మీడియా మేనేజ్​మెంట్​ రేవంత్​రెడ్డి విజయవంతంగా చేశాడు. అలాగే తన ఉపన్యాసాలతో కేసీఆర్​కు నోరు లేకుండా చేశాడు. కుక్క అని కేసీఆర్​ అంటే ఊర కుక్క అనీ, బక్కోడిని  అని కేసీఆర్​ అంటే బకాసురుడని ఆయన మాటల్ని ఆయనకే  అప్పగించాడు. అలాగే కేసీఆర్​ను గట్టిగా తిట్టడమే గాకుండా ఏ నియోజకవర్గంలోకి వెళ్లినా అక్కడి బీఆర్​ఎస్​ అభ్యర్థులపై విరుచుకుపడడం అక్కడి ప్రజలను కనెక్ట్​ చేసింది.

ప్రజాకాంక్షలు నెరవేర్చకపోతే బేతాళ కథే

 ఫాంహౌస్​ కేసును బీజేపీ మెడకు చుట్టి కేసీఆర్​రక్తి కట్టించిన తీరు బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు దిగుతుండగా బీజేపీ–బీఆర్ఎస్–మజ్లిస్​లు ఒక్కటే అన్న కాంగ్రెస్​ ప్రచారం బీజేపీ సరిగ్గా ఎదుర్కొలేకపోయింది. స్టార్​ క్యాంపెయినర్లంతా వాళ్ల స్వంత నియోజకవర్గాలకు పరిమితం కావడం, షా, మోదీ, నడ్డా, యోగి మొదలైనవారంతా బహిరంగ సభల్లో జాతీయాంశాలు మాట్లాడడం వల్ల ప్రజల్లో  ఓ జోష్​ వచ్చినా బీఆర్ఎస్ పై కోపం ప్రదర్శించేలా చేయలేకపోయింది.  8 సీట్లు తీసుకున్న పవన్​ కల్యాణ్​ కేసీఆర్​ను ఒక్కమాట అనకుండా తెలివిగా మాట్లాడి మోదీని పొగిడి బయటపడ్డాడు. బీజేపీ వరంగల్ సభలో పవన్​ కల్యాణ్​ గద్దరన్న తెలంగాణ అంటే అందరూ నోరెళ్లబెట్టారు. ఈ పరిణామాలు మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా సంతోషంగా ఉండలేని స్థితిగా ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్​ చేసిన పొరపాట్లు కాంగ్రెస్​ చేయకుండా ఉంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్లు అవుతుంది. లేదంటే బేతాళ కథనే.

సర్కారుపై యువత ఆగ్రహం

లక్షలాది మంది ఉద్యోగులను పీఆర్సీ, డీఏ, 317 జీవో  విషయంలో చేసిన దుర్మార్గం ప్రభుత్వంపై వ్యతిరేకతకు మౌత్​ పబ్లిసిటీ ఇచ్చింది. మరోవైపు టీఎస్​పీఎస్సీ తప్పులను సరిచేసేదిపోయి ఇది మా ఇష్టం అన్నట్లు ప్రవర్తించడం, గ్రూప్ వన్​ పరీక్ష వాయిదాలు, డీఎస్సీ లేకపోవడం, యూనివర్సిటీల్లో ఒక్క పోస్టూ భర్తీ చేయకపోవడం యువతకు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. జగన్​తో దోస్తీతో కృష్ణా జలాల ఒప్పందం, కాళేశ్వరం అవినీతి, దక్షిణ తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డికి మొండిచెయ్యి, మేడిగడ్డ కూలడం వంటివాటిపై ప్రభుత్వ దబాయింపులను ప్రజలు హర్షించలేదన్నది నిష్టుర సత్యం. బండి సంజయ్​ని అరెస్టు చేయడం చాలామంది యువతలో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగించింది. ఎవరూ అడగకుండా సచివాలయం నిర్మాణం చేసినా, డబుల్​ బెడ్రూంలు ఇవ్వలేదనే ప్రచారం బాగా వ్యతిరేకత పెంచింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని ఎప్పుడూ శత్రువులుగానే చూశారు. వాళ్లను అణగదొక్కాలని చూడడం వల్ల వాళ్లంతా ఇటీవల చేతివాటం చూసి కాంగ్రెస్​లోకి వెళ్లిపోయారు. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత రోడ్లు దారుణంగా దెబ్బతిన్నా ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారు. మొత్తానికి ఓడినప్పుడు వంద చెప్తారుగానీ అలాకాకుండా ఉచితాలు మాత్రమే తెలంగాణ ప్రజలు ఆశిస్తారనుకోవడం తప్పు.

కలిసొచ్చిన రేవంత్​ లెక్కలు

రేవంత్​రెడ్డి కరెంటు లెక్కలు, నీళ్ల లెక్కలు మొదలైన విషయాలను ప్రజలకు అర్థం అయ్యేట్లుగా, అధ్యయనశీలి చెప్పినట్లుగా చెప్పడం అతడి వ్యక్తిత్వాన్ని అమాంతం పెంచాయి. అలాగే సందేహం లేకుండా ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో స్పష్టతతో వ్యవహరించడమే కాంగ్రెస్​ విజయానికి రేవంత్​ వేసిన రాచమార్గం. కేసీఆర్​ మెత్తగా మాట్లాడినప్పుడే కాంగ్రెస్ విజయం నిర్ణయం అయిపోయింది. బీజేపీ విషయానికొస్తే బండి సంజయ్​ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పాతాళం నుంచి ఆకాశంలోకి వెళ్లింది. అనేక విజయాలతోపాటు కేసీఆర్​పై తిరగబడిన నాయకుడిగా కన్పించాడు. ఈలోపు కవిత అరెస్టుపై దుమారం మొదలైంది. కర్నాటక ఫలితాల తర్వాత బీజేపీలో ఉన్న పదిమంది లీడర్ల మధ్య వైరుధ్యాల్లో ప్రజలకు అనేక అంశాలు కన్పించాయి. కవిత అరెస్ట్​ లేకపోవడం, సంజయ్​ని తప్పించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇంత డ్యామేజీ జరుగుతున్నా కేంద్ర నాయకత్వం దీనిపై అనుమాన నివృత్తి చేయలేకపోయింది. దాంతో పార్టీలో చేరినవారు మెల్లగా కాంగ్రెస్​లోకి దూకడం మొదలయ్యింది. 

- డా.పి. భాస్కర యోగి,సోషల్​ ఎనలిస్ట్​