ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు షురూ .. ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున నిర్వహణ

ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు షురూ .. ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున నిర్వహణ
  • మొత్తం 143 గ్రామాల్లో సదస్సులు
  • భూ సమస్యలపై ధరఖాస్తుల స్వీకరణ
  • ఎక్కువ దరఖాస్తులు సాదాబైనామాలవే

వెలుగు, నెట్​వర్క్: భూభూరతి ఆర్వోఆర్ యాక్టులో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున సదస్సులు జరిగాయి. ఆదిలాబాద్​ జిల్లాలో 40, నిర్మల్​లో 36, మంచిర్యాలలో 32, ఆసిఫాబాద్​ జిల్లాలో 35 సదస్సులు జరిగాయి. వివిధ సమస్యలపై మంచిర్యాల జిల్లాలో మొత్తం 802 అప్లికేషన్లు రాగా ఆసిఫాబాద్​ జిల్లాలో 357 అప్లికేషన్లు వచ్చాయి. 

ఇప్పటికే భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా భీమారం మండలాన్ని ఎంపిక చేసి గత నెల 5 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం తెలిసందే. 12 గ్రామపంచాయతీల్లో జరిగిన సదస్సుల్లో 2148 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా సెకండ్ ఫేజ్లో జిల్లాలోని మిగిలిన మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం, లింగాపూర్, జైపూర్ మండలంలో ముదిగుంట, బెజ్జాల, తాండూరు మండలంలోని పెగడపల్లి, ద్వారకాపూర్, కోటపల్లి మండలంలో శెట్​పల్లి, అర్జునగుట్ట, బెల్లంపల్లి మండలం బట్వాన్​పల్లి, అంకుశం గ్రామాల్లో సదస్సులు జరిగాయి. 

ఎక్కువగా సాదాబైనామాలవే..

ఈ సదస్సుల్లో ఎక్కువగా సాదాబైనామాలపైనే అప్లికేషన్లు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు, డీఎస్ పెండింగ్, సక్సెషన్, అసైన్డ్, ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, ఎక్స్​టెంట్ కరెక్షన్, విరాసత్, లావుని పట్టా, నేమ్ కరెక్షన్, సక్సెషన్, నాలా వితౌట్ పాస్​బుక్, క్లాసిఫికేషన్, పెండింగ్ మ్యుటేషన్, డాటా కరెక్షన్ తదితర సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లను అధికారులు స్వీకరించారు. వీటన్నిటిని పాత రికార్డుల ఆధారంగా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

భూభారతి చట్టంతో భూముల సమస్యలు పరిష్కారం

భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం లక్ష్మణచాంద మండలం కనకాపూర్, నిర్మల్ గ్రామీణ మండలం అక్కపూర్‌లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల భూ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, నేటి నుంచి జూన్ 20వ తేదీ వరకు రెండో విడత సదస్సులు జరుగుతాయని వెల్లడించారు.

 సదస్సుకు వచ్చిన ప్రజల భూములకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించి, వెంటనే రసీదులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్లు సరిత, సంతోష్, ఎంపీడీవో గజానన్ తదితరులు పాల్గొన్నారు. 

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం

ప్రజల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా అన్నారు. నేరడిగొండ మండలంలోని ఆరేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా జరిగిన సాదాబైనామాలను క్రమబద్ధీకరణ, వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. 

అడిషనల్​కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ ఖలీమ్, ఆర్ఐ నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ మండలం సింగపూర్ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో  ఆర్డీవో రత్న కల్యాణి, తహసీల్దార్ సుజాతారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా భూముల సమస్యలు వెంట వెంటనే పరిష్కారమవుతాయని అన్నారు. 

మరిన్ని వార్తలు