
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర భూవివాదం కేసు విచారణలో అధికారులకు పెద్ద ఇబ్బంది ఎదురైంది. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు మిసయ్యాయి. దీంతో ఈ కేసు విచారణకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 1955కు చెందిన రికార్డులు కావడంతో వాటిని ధ్వంసం చేశామని అధికారులు చెప్పారు. సోన్‌భద్ర జిల్లా 1989 వరకు మిర్జాపూర్‌లో భాగమని, రికార్డులు కూడా ఆ టైంకు చెందినవని అడిషనల్ కలెక్టర్ యోగేంద్ర బహదూర్ అన్నారు. పేపర్లు ఎక్కువ రోజులు ఉంచే పరిస్థితి లేనందున రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా కాలం చెల్లిన రికార్డులను ధ్వంసం చేస్తామన్నారు. సోన్‌భద్ర భూవివాదం 1955లో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం వల్లే తలెత్తిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ఒకరు ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు ఈ భూమిని కట్టబెట్టారని, 1989లో భూమిని ట్రస్ట్ నుంచి సభ్యుల పేరుమీదికి మార్చారని చెప్పారు. ఈ కేసును విచారించేందుకు యూపీ ప్రభుత్వం కమిటీ వేసింది. పదిరోజుల్లో విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. సోన్‌భద్ర జిల్లా ఉబ్భా గ్రామంలో జరిగిన భూవివాదంలో గ్రామ పెద్ద యోగ్యదత్ 10 మంది గిరిజనుల్ని కాల్చి చంపి, మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.