డిమాండ్​ పుంజుకోవడంతో అమ్మకాలు పెరిగాయి : మారుతి సుజుకి

డిమాండ్​ పుంజుకోవడంతో  అమ్మకాలు పెరిగాయి : మారుతి సుజుకి

రెవెన్యూ రూ. 29,931 కోట్లు

న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి లాభం సెప్టెంబర్​ 2022 క్వార్టర్లో నాలుగింతలైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లోని రూ. 475 కోట్ల నుంచి ఈ లాభం ఈ సెప్టెంబర్​ క్వార్టర్లో రూ. 2,061 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా 46 శాతం గ్రోత్​తో రూ. 29,931 కోట్లకు చేరింది. అమ్మకాలు తాజా క్వార్టర్లో 36 శాతం ఎక్కువై 5,17,395 యూనిట్లకు చేరినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ఇంతకు ముందు ఏ క్వార్టర్లోనూ ఇంత ఎక్కువ సేల్స్​ రికార్డు కాలేదని పేర్కొంది. దేశీయ అమ్మకాలు 4.54 లక్షల యూనిట్లయితే, ఎగుమతులు 63,195 యూనిట్లని మారుతి సుజుకి  తెలిపింది. 

డిమాండ్​ పుంజుకోవడంతో  అమ్మకాలు పెరిగాయని, ఫలితంగా కెపాసిటీ యుటిలైజేషన్​ మెరుగై లాభదాయకత పెరిగిందని కంపెనీ పేర్కొంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఆర్డర్లలో 4.12 లక్షలు పెండింగ్​లో ఉన్నాయని, ఇందులో 1.3 లక్షల ఆర్డర్లు తాజాగా లాంఛ్​ చేసిన మోడల్స్​ కోసమే వచ్చాయని మారుతి సుజుకి వివరించింది. ఎలక్ట్రానిక్​ కాంపోనెంట్స్​ ​ కొరత వెంటాడుతున్న కారణంగా 35 వేల వెహికల్స్​ ప్రొడక్షన్​ ఎఫెక్టయినట్లు వెల్లడించింది.