కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ .. ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ .. ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు బుధవారం ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా నిధులను నిలిపివేస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఉదయం కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌తోపాటు కాంగ్రెస్  అగ్రనేతలు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు.

రాష్ట్రాల పన్ను ఆదాయంతో పాటు ఇతర నిధులు ఇవ్వకుండా కేంద్రం తమకు అన్యాయం చేసిందని సిద్ధరామయ్య ఆరోపించారు. తమ విన్నపం కేంద్రం వింటుందనే ఉద్దేశంతోనే తాము ఈ నిరసన చేపట్టామని సీఎం సిద్ధరామయ్య అన్నారు.  ఇది బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ నిరసన కాదని.. కేంద్రం సవతి తల్లి వైఖరిని నిరసిస్తున్నామని పేర్కొన్నారు.

బెంగళూరులో సీఎంవో ముట్టడికి బీజేపీ యత్నం

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆందోళనను నిరసిస్తూ బెంగళూరులో బీజేపీ నేతలు సీఎంవో ముట్టడికి యత్నించారు. తొలుత విధానసౌధ సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత సీఎంవో వైపు దూసుకురాగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆందోళనలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ.. కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టి, ఇంత డ్రామా చేసిన ప్రభుత్వం కర్నాటక చరిత్రలో లేదని అన్నారు.