
అదో పెద్ద నగరం. మూడు భాగాలుగా కట్టారు. మధ్యలో పెద్ద టవర్‌లతో కూడిన కోటలాంటి రాజభవనం. చుట్టూ ప్రహరీ గోడలు. అందులో ఓపెన్ స్పేస్‌లు, సెక్యూరిటీ గేట్ వేలు. దాని చుట్టూ మధ్యస్థాయిలో ఉండే ఇండ్లు. అధికారుల కోసం ప్రత్యేక కాలనీ. ఆ తర్వాత లోయర్ టౌన్. నగరం అంతటా బావులు, డ్రైనేజీ సిస్టం, రోడ్లు పర్ఫెక్ట్గా ఏర్పాటు చేశారు. సిటీకి సరస్వతి నది నుంచి నేరుగా నీరు కాలువల ద్వారా వచ్చేది. అదే ప్రస్తుత గుజరాత్ లో, ఒకప్పుడు హరప్పా నాగరికత కాలంలో కట్టిన ధోలావీరా నగరం. ఇతర హరప్పన్ సిటీలకు భిన్నంగా ఎక్కువగా రాళ్లతోనే కట్టిన ఈ సిటీని హరప్పా సివిలైజేషన్ కాలంలోని ఐదు అతిపెద్ద నగరాల్లో ఒకటని, ఆ కాలంలో అన్నింటికంటే ఆధునికమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన నగరమని చెప్తుంటారు. అయితే, అరేబియా సముద్ర తీరంలో1700 ఏండ్ల పాటు మనుగడలో ఉన్న ఈ నగరం వాతావరణ మార్పుల వల్లే భూస్థాపితం అయిపోయిందట! ఐఐటీ ఖరగ్ పూర్‌కు చెందిన అనింద్య సర్కార్, తోర్సా సేన్ గుప్తా, పుణేలోని డెక్కన్ కాలేజ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ఇండియా (ఏఎస్ఐ) రీసెర్చర్ల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
4 వేల ఏళ్ల కిందట సరస్వతి నది ఎండిపోయి..
పురావస్తు ఆధారాలను బట్టి ధోలావీరా నగరం 3,800 ఏండ్ల నుంచి 5,500 ఏండ్ల క్రితం ఉన్నట్లు ఆర్కియాలజిస్టులు చెప్తారు. అయితే, 4 వేల ఏండ్ల క్రితం తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించాయట. దీంతో 200 ఏండ్ల పాటు ఇక్కడ తీవ్ర కరువు తాండవించిందట. ఫలితంగా సరస్వతి నది పూర్తిగా ఎండిపోయిందట. కాలక్రమంలో ధోలావీరా నగరం కొలాప్స్ అయిపోయి మట్టిలో కలిసిపోయిందట. గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఆధారాలను బట్టి రీసెర్చర్లు ఈ విషయం చెప్తున్నారు. మేఘాలయన్ యుగం ప్రారంభంలో ఈ సిటీ నాశనమై ఉంటుందని రీసెర్చర్లు అంటున్నారు.
నత్తగుల్లల శిలాజాలే ఆధారాలు..
ధోలావీరా సిటీ ప్రాంతంలో ఒకవైపు సముద్రపు నీరు.. మరోవైపు నదీ నీరు కలిసిపోవడంతో మంగ్రూవ్స్ (మడ అడవులు) పెద్దమొత్తంలో ఉండేవని రీసెర్చర్లు గుర్తించారు. ఇక్కడి తవ్వకాల్లో దొరికిన నత్తలు, ఇతర మొలస్కన్ జీవుల కార్బొనేట్ గవ్వలను వీరు కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించారు. దీంతో నత్తల శిలాజాల్లో ఆ కాలంలో ఏర్పడిన క్లైమేట్ చేంజ్‌కు సంబంధించిన మార్పులను గుర్తించారు. మంగ్రూవ్స్‌లో నత్తలు ఎక్కువగా ఉండేవని, ధోలావీరా ప్రజలు వీటిని ఆహారంగా తీసుకుని ఉండవచ్చనీ అంచనా వేశారు. మొత్తానికి క్లైమేట్ చేంజ్ అనేది ఎంత పెద్ద సివిలైజేషన్‌ను అయినా ఎలా తుడిచిపెట్టేస్తుందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ గా నిలుస్తుందని రీసెర్చర్లు పేర్కొంటున్నారు. ఈ స్టడీ వివరాలు ‘జర్నల్ ఆఫ్ క్వార్టర్నరీ సైన్సెస్’లో పబ్లిష్అయ్యాయి.