పాట్నా: బిహార్‌లో చొరబాటుదారులు పెరిగేందుకు ప్రతిపక్షాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. చొరబాటులను ఉద్దేశించి మోదీ చేసిన విమర్శలన్నీ త్వరలో బిహార్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు వేసిన ఎత్తుగడని వెల్లడించారు. మంగళవారం తేజస్వి యాదవ్ జెహానాబాద్ జిల్లాలో "బిహార్ అధికార్ యాత్ర"ను ప్రారంభించారు.
అంతకంటే ముందు ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. "పూర్ణియాలో జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలే చొరబాటుదారులను కాపాడుతున్నాయని ఆరోపించారు. సరే.. బిహార్‌లో చొరబాటుదారులు ఉన్నారని అనుకుందాం. మరి మీరు ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఏంచేశారు? చొరబాట్లను ఎందుకు అడ్డుకోవట్లేదు. అసలు మీరు ఇప్పటిదాకా ఒక్క చొరబాటుదారుడినైనా గుర్తించగలిగారా?" అని తేజస్వి ప్రశ్నించారు.
