
- విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
- ఏడుగురు మహిళలు మృతి
- ట్రాక్టర్‌లో 30మంది కూలీలు!
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ తీగలు తెగి ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిపై పడ్డాయి . దీంతో కూలీలు విద్యుద్ఘాతంతో మరణించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు, ఓ రైతు ఉన్నారు. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడంతో ఈ రోజు ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోలలో పనులకు వెళ్లే వీరంతా కరోనాతో భౌతిక దూరం నిబంధనలు అమలులో ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్లలో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ తీగలు ట్రాక్టర్‌పై పడటంతో విద్యుదాఘాతంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 15మంది వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ రోజు ఉదయం పనులకు వెళ్లిన వీరంతా.. సాయంత్రం ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది.