- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- జనగామ జిల్లా దేవరుప్పుల వద్ద ప్రమాదం
బచ్చన్నపేట (దేవరుప్పుల), వెలుగు : బైక్, టాటా ఏస్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి శివారులో ఆదివారం జరిగింది. ఏపీలోని కర్నూల్ జిల్లా మొగరి గ్రామానికి చెందిన బోయ నర్సింహ (20), వనపర్తి జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన చీరోలు భరత్ (22) కొడకండ్ల మండలంలోని రామన్నగూడెంలో ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం బైక్‌పై దేవరుప్పులకు వస్తున్నారు.
ఈ క్రమంలో గొల్లపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సుకు తగిలి కింద పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నర్సింహ, భరత్ అక్కడికక్కడే చనిపోయారు. అలాగే టాటా ఏస్‌లో ఉన్న కొంగరి భాస్కర్, రాపాక ఉప్పలయ్య, రేణుక తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో జనగామ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దేవరుప్పుల పోలీసులు తెలిపారు.