
తిరుపతిలో భారీ వర్షం బీబత్సం సృష్టించింది. శనివారం ( అక్టోబర్ 4 ) కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో బయటికి రాలేక ప్రజలు ఇబ్బంది పడ్డారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు వర్షపు నీటితో నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థ పడుతున్నారు.
తిరుపతిలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలు. రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా వర్షపు నీరు నిలిచిపోయింది.. ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పోలీసులు చిన్న వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. భారీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించింది ప్రభుత్వం.