PBKS vs MI: మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ చిల్.. అయ్యర్ నడకను ఎగతాళి చేసిన హిట్ మ్యాన్

PBKS vs MI: మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ చిల్.. అయ్యర్ నడకను ఎగతాళి చేసిన హిట్ మ్యాన్

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా హిట్ మ్యాన్ మాత్రం తన సహనాన్ని కోల్పోడు. కూల్ గా ఉంటూ జట్టుకు తాను ఏం చేయగలడో అది మాత్రమే ఆలోచిస్తాడు. గెలుపోటములు పక్కనపెట్టి సరదాగా చిల్ అవుతాడు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో సహచర ప్లేయర్లను ఎగతాళి చేసి ఆటపట్టిస్తుంటాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో సోమవారం (మే 26) జరిగిన మ్యాచ్ లో ఈ ముంబై ఓపెనర్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న పంజాబ్ కింగ్స్.. సోమవారం (మే 26) ముంబై ఇండియన్స్ పై తమ చివరి లీగ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీతో  క్వాలిఫయర్ 1 లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వాకింగ్ స్టైల్ ను ఇమిటేట్ చేసి నవ్వించాడు. శ్రేయాస్ తన దగ్గరకు వస్తున్నాడని గమనించిన రోహిత్.. అయ్యర్ ఎలా నడుస్తాడో అలాగే నడిచి షేక్ హ్యాండ్ ఇవ్వడం విశేషం. ముంబై మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ సరదాగా అయ్యర్ తో మాట్లాడడం నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 24 పరుగులు చేసి విఫలం కాగా.. అయ్యర్ 26 పరుగులు చేసి పంజాబ్ కు విన్నింగ్ రన్స్ అందించాడు. 

►ALSO READ | ఫ్రెంచ్ ఓపెన్ లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అల్కరాజ్ బోణీ

ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. జైపూర్ వేదికగా సోమవారం (మే 26) ముగిసిన మ్యాచ్ లో ముంబైపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ప్లేయర్ జోస్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73:9 ఫోర్లు, 3 సిక్సర్లు), టీమిండియా యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 62:9 ఫోర్లు, 2 సిక్సర్లు) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది.