పీఎఫ్‌ అకౌంట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లు విత్​ డ్రా

పీఎఫ్‌ అకౌంట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లు విత్​ డ్రా
  • పీఎఫ్‌ అకౌంట్ల నుంచి విత్​ డ్రా చేసుకున్నది రూ.1.25 లక్షల కోట్లు
  • కరోనా అడ్వాన్స్‌‌‌‌ల కింద రూ. 18,500 కోట్లు..
  • జాబ్‌‌ లాస్ ఎక్కువగా జరిగిందంటున్న ఎనలిస్టులు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు:  కరోనా సంక్షోభంతో ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఎంప్లాయీస్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ ఆర్గనైజేషన్‌‌(ఈపీఎఫ్‌‌ఓ) సబ్‌‌స్క్రయిబర్లలో  సగానికి పైగా ఉద్యోగులు  తమ పీఎఫ్‌‌ అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేసుకున్నారు. కిందటేడాది ఏప్రిల్‌‌ 1  నుంచి ఈ ఏడాది మే వరకు గమనిస్తే 3.5 కోట్ల మంది పీఎఫ్‌‌ సబ్‌‌స్క్రయిబర్లు తమ అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేసుకున్నారు.  ఇందులో సుమారు 72 లక్షల మంది ‘కరోనా అడ్వాన్స్‌‌’ ఆప్షన్‌‌ ద్వారా విత్‌‌డ్రా చేసుకోవడం గమనార్హం. వీరు సుమారు  రూ. 18, 500 కోట్లను విత్‌‌డ్రా చేసుకున్నారని ఈపీఎఫ్‌‌ఓ డేటా చెబుతోంది. కాగా, ప్రస్తుతం ఈపీఎఫ్‌‌ఓ సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. విత్‌‌డ్రాలతో పాటు పెన్షన్‌‌, డెత్ ఇన్సూరెన్స్‌‌, పీఎఫ్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌లను కలుపుకుంటే  పైన పేర్కొన్న 3.5 కోట్ల మంది సబ్‌‌స్క్రయిబర్లు రూ. 1.25 లక్షల కోట్లను విత్‌‌డ్రా చేసుకున్నారు. ఆర్థిక సంవత్సరం 2019–20 లో ఈపీఎఫ్‌‌ఓ రూ. 81,200 కోట్ల క్లెయిమ్స్‌‌ను సెటిల్ చేసింది. మొత్తం 1.63 కోట్ల సబ్‌‌స్క్రయిబర్లు  ఈ క్లెయిమ్స్‌‌ కోసం అప్లయ్‌‌ చేసుకున్నారు.

కరోనాతో ఉద్యోగాలు కోల్పోయారు..
సాధారణంగా ఏడాది ప్రాతిపదికన చూస్తే పీఎఫ్‌‌ విత్‌‌డ్రాయల్స్‌‌ 10 శాతం పెరుగుతూ వస్తున్నాయని  ఎనలిస్టులు పేర్కొన్నారు. రిటైర్‌‌‌‌మెంట్‌‌ అయిన ఉద్యోగులు తమ పీఎఫ్‌‌ మనీని బయటకు తీసుకోవాలనుకోవడంతో పాటు జాబ్స్‌‌ షిఫ్ట్‌‌ అయ్యే ఉద్యోగుల వలన విత్‌‌డ్రాయల్స్‌‌ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. కానీ, ఈ సారి కరోనా సంక్షోభం కూడా తోడవ్వడంతో యావరేజ్‌‌ కంటే ఎక్కువ పీఎఫ్‌‌ విత్‌‌డ్రాయల్స్ జరిగాయని అభిప్రాయపడ్డారు. కరోనా వలన ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయి ఉంటారని, ఖర్చుల కోసం పీఎఫ్‌‌ మనీని విత్‌‌డ్రా చేసుకొని ఉంటారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  ముంబై, పుణె, ఢిల్లీ, బెంగళూరు సిటీల నుంచి ఎక్కువ క్లెయిమ్స్ వచ్చాయని ఈపిఎఫ్‌‌ఓ డేటా చెబుతోంది.ఈ సిటీలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయిన విషయాన్ని గమనించాలి. ఈ క్లెయిమ్స్‌‌ను ఆటోమెటిక్ మోడ్‌‌లో అప్లికేషన్‌‌ సబ్మిట్ చేసిన 72 గంటల్లోనే ఈపీఎఫ్‌‌ఓ సెటిల్ చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌‌ నుంచి 75 శాతం అమౌంట్‌‌ను లేదా మూడు నెలల బేసిక్ శాలరీని విత్‌‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం కిందటేడాది అనుమతిచ్చిన విషయం తెలిసిందే.  ‘కరోనా వలన సగటున రూ. 25 వేలను పీఎఫ్‌‌ సబ్‌‌స్క్రయిబర్లు విత్‌‌డ్రా చేసుకున్నారు. దీనర్ధం వారి జీతం ( బేసిక్‌‌+ డీఏ) సుమారు రూ. 8,000–9,000 దగ్గర ఉంది. తక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగులు ఎక్కువగా విత్‌‌డ్రాయల్స్ పెట్టారు’ అని ఎక్స్‌‌ఎల్‌‌ఆర్‌‌‌‌ఐ ప్రొఫెసర్‌‌‌‌ కేఆర్ శ్యామ్‌‌ సుందర్ అన్నారు. ఈ ఉద్యోగుల పీఎఫ్‌‌ బెనిఫిట్స్‌‌ తగ్గిపోతాయని పేర్కొన్నారు.  లాంగ్‌‌, మీడియం టెర్మ్‌‌లకు గాను వీరి సోషల్‌‌ సెక్యూరిటీ ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 

పీఎఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌పై రూ. 7 లక్షలు..
పీఎఫ్‌‌ అకౌంట్ ఉన్నవారు గరిష్టంగా రూ. 7 లక్షల ఇన్సూరెన్స్‌‌ను పొందొచ్చు. పీఎఫ్‌‌ అకౌంట్ ఉన్నవారు  ఎంప్లాయీస్‌‌ డిపాజిట్‌‌–లింక్డ్‌‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌ (ఈడీఎల్‌‌ఐ) స్కీమ్‌‌కు అర్హులన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌‌ కోసం ఉద్యోగి ఎటువంటి మనీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంప్లాయర్‌‌‌‌ (జాబ్‌‌ ఇచ్చిన కంపెనీ) వీరి తరపున చెల్లిస్తుంది. ఉద్యోగి బేసిక్ శాలరీలో 0.5 శాతాన్ని లేదా గరిష్టంగా నెలకు రూ. 75 లను కంపెనీలు ఈ స్కీమ్‌‌ కోసం చెల్లిస్తాయి.  ఉద్యోగి చనిపోతే ఈ స్కీమ్‌‌ కింద గరిష్టంగా రూ. 7 లక్షలను ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌‌గా నామినీకి అందుతాయి. కనిష్టంగా రూ. 2.5 లక్షలు దక్కుతాయి. ముందు ఈ స్కీమ్‌‌ కింద గరిష్టంగా రూ. 6 లక్షలను ఇన్సూరెన్స్‌‌ అమౌంట్‌‌గా ఇచ్చేవారు. సవరించిన మార్పులను ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి పరిగణనలోకి తీసుకుంటారు.  పీఎఫ్ అకౌంట్‌‌లో నామినీగా ఉన్నవారికి ఈ డబ్బులను ఇస్తారు. ఒకవేళ నామినీ పేరు ప్రొవైడ్ చేయకపోతే కుటుంబ సభ్యులు దగ్గర్లోని పీఎఫ్‌‌ ఆఫీస్‌‌కు వెళ్లి నామినీ లిస్ట్‌‌లో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగి చనిపోతే నామినీ తమ క్లెయిమ్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో సబ్మిట్ చేసుకోవచ్చు.  కాగా, పీఎఫ్‌‌ కడుతున్న అన్ని కంపెనీలు ఈ స్కీమ్‌‌ను సబ్‌‌స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గ్రూప్‌‌ పాలసీలను ప్రొవైడ్ చేస్తామనుకుంటే ఆ పాలసీ బెనిఫిట్స్‌‌ ఈ  స్కీమ్‌‌ బెనిఫిట్స్‌‌కు సమానంగా లేదా ఎక్కువగా ఉండాలి.