
ఇండ్ల కోసం తెలంగాణకు 1,310 కోట్లు ఇచ్చినం
పీఎంఏవై కింద రూ.190 కోట్లు, అర్బన్ కింద 1,120 కోట్ల మంజూరు
190 కోట్ల ఫండ్స్‌కు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు
లోక్‌సభలో కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం అమలు కోసం రూ.1,310 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. పీఎంఏవై(గ్రామీణ్) కింద రూ.190.79 కోట్లు, పీఎంఏవై(అర్బన్) కింద 1,120.72 కోట్లను ఇచ్చినట్లు చెప్పింది. పీఎంఏవై అమలు కోసం ఇచ్చిన నిధులను ఇతర పథకాలు, అవసరాల కోసం రాష్ర్టాలు మళ్లించుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. పీఎంఏవై అమలుకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ర్టాల్లో ఫండ్స్ వినియోగం, నిధుల మళ్లింపు అంశాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా బదులిచ్చారు. పీఎంఏవై(గ్రామీణ్) నిధులను ఫ్రేమ్ వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్(ఎఫ్ఎఫ్ఐ) కింద రిలీజ్ చేశామని, ఫండ్స్‌ను విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉండదని, ఆ నిధులను మళ్లించేందుకు కూడా ఎలాంటి అవకాశం లేదని తోమర్ పేర్కొన్నారు.
2016–17లో పీఎంఏవై (గ్రామీణ్) కింద తొలి విడతలో తెలంగాణకు రూ.190.79 కోట్లను రిలీజ్ చేశామని, పీఎంఏవై(అర్బన్) కింద 1,86,786 ఇళ్లకు అప్రూవల్ ఇచ్చామని చెప్పారు. ఇందులో కేంద్ర సాయం రూ.2,801.79 కోట్లని, తొలి విడతగా రాష్ర్ట ప్రభుత్వానికి 1,120.72 కోట్లను ఇచ్చినట్టు చెప్పారు. నిధులను మళ్లించినట్లు రిపోర్టు కాలేదన్నారు. పీఎంఏవై(గ్రామీణ్) పథకం అమలులో తెలంగాణలో ప్రోగ్రెస్ కనిపించలేదని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ర్ట ప్రభుత్వం మాకు ఇవ్వలేదని చెప్పారు. దీంతో విడుదల చేసిన నిధులను సరెండర్ చేయాలని రాష్ర్టాన్ని కోరామని, పీఎంఏవై(అర్బన్) కింద విడుదల చేసిన 1,120.72 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించిందని వెల్లడించారు.