
- రూ. 50 వేల నుంచి రూ.2 లక్షల తీసుకునే వెసులుబాటు
- మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా అమలు
- రుణం తీసుకొని బేస్మెంట్లు పూర్తిచేసుకుంటున్న లబ్ధిదారులు
ఆదిలాబాద్, వెలుగు: గూడులేని పేదల కోసం పక్కా ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర ధృఢ సంకల్పంతో ఉంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చి అర్హులు ఇండ్లు నిర్మించుకునేలా చేయూతనందిస్తోంది. ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ పూర్తిచేసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తోంది. అయితే చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మహిళ సంఘాల్లో సభ్యులకు ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇచ్చే అవకాశం కల్పించింది.
మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. రూపాయి వడ్డీతో రూ.50 వేలు తీసుకుంటే 24 నెలల పాటు ప్రతి నెలా వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసుకొని సంఘం సభ్యుల తీర్మానంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చు. చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు న్నారు. రుణం తీసుకొని ఇంటి నిర్మాణాలు చకచకా పూర్తి చేస్తున్నారు.
ఊపందుకున్న నిర్మాణాలు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండ్ల నిర్మాణానికి మొదట్లో చాలా మంది ఆసక్తి చూపలేదు. మొదటి విడత ఇండ్లు మంజూరు చేసిన తర్వాత ఆరు నెలల పాటు కొందరు లబ్ధిదారులు ముగ్గు పోసుకోకపోవడంతో అధికారులు ఆరా తీశారు. ఆర్థిక సమస్యలతో ఇండ్ల నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారని సర్వేలో వెల్లడి కావడంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించడంతో లబ్ధిదారులు ముందుకొస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 36 మంది లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. గత నెల రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీ పనులు మాత్రం ఆపడం లేదు. జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండు విడతల్లో 9,093 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 6,402 ఇండ్లకు మార్క్ వేశారు. 1664 ఇండ్లు బేస్మెంట్ లెవల్, 160 ఇండ్ల రూప్ లెవల్లో, 42 ఇండ్లు స్లాబ్ లెవల్లో పూర్తయ్యాయి.
రూ.50 వేలు తీసుకొని బెస్మెంట్ పూర్తి చేశా
ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కానీ బేస్మెంట్ కట్టుకోవడానికి మా దగ్గర సమయాని డబ్బులు లేక ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తుండటంతో నేను రూ.50 వేలు తీసుకొని పనులు ప్రారంభించాను. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తవడంతో రూ.లక్ష బిల్లు వచ్చింది. మహిళా సంఘాల రుణం ఎంతో సాయం చేసింది.
లక్ష్మి, అందుగూడ గ్రామం, బజార్ హత్నూర్
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇస్తున్న రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు మహిళా సంఘాల సభ్యులెవరైనా రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.
రవీందర్ రాథోడ్, డీఆర్డీవో