
- రూ. 21 వేలు వెంటనే ఫ్రెండ్‌కు పంపిన తమిళనాడుకు చెందిన రాజ్‌కుమార్
- 30 నిమిషాల్లోనే డబ్బులు తిరిగి తీసేసుకున్న తమిళనాడు మర్కంటైల్
- విత్‌డ్రా అయిన అమౌంట్‌ను తిరిగి అడగని బ్యాంక్
బిజినెస్ డెస్క్, వెలుగు: తమిళనాడుకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ అకౌంట్‌లోకి ఏకంగా రూ.9,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అకౌంట్ నెంబర్‌లో ఒక డిజిట్ అదనంగా పడడం వలన ఈ అమౌంట్‌ను తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) తన కస్టమర్ అకౌంట్‌లో డిపాజిట్ చేసింది . రాజ్‌కుమార్ పళని దగ్గరలోని నైకరపాటి గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నెల 9 న సాయంత్రం మూడున్నర టైమ్‌లో తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.9,000 కోట్లు పడినట్టు మెసేజ్ వచ్చిందని రాజ్‌కుమార్ అన్నారు. మొదటిలో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా లెక్క పెట్టలేకపోయానని చెప్పారు. కానీ తన తప్పు తెలుసుకున్న టీఎంబీ 30 నిమిషాల్లోనే ఈ డబ్బులను తిరిగి తీసేసుకుంది. ఈ టైమ్‌లోపు రాజ్‌కుమార్ తన ఫ్రెండ్‌కు రూ.21 వేలు పంపించారు. బ్యాంక్ అధికారులు సెప్టెంబర్ 10 న తనను సంప్రదించారని, తన ఫ్రెండ్‌కు పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ డబ్బులు పడక ముందు ఆయన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ.105 ఉన్నాయి. అంతేకాకుండా కారు లోన్‌ను బ్యాంక్ ఆఫర్ చేసిందని ఆయన వివరించారు.
15 డిజిట్ల నెంబర్‌కు బదులు 16 డిజిట్లు..
ఈ సంఘటనపై టీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ‘సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తున్నాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏసీహెచ్) అందుకున్న క్రెడిట్ ఫైల్‌లో కొన్ని ఇన్‌వాలిడ్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. కొన్ని కేసుల్లో అకౌంట్ నెంబర్ 15 డిజిట్స్ ఉండడానికి బదులు 16 డిజిట్స్ ఉన్నాయి. ఎన్‌ఏసీహెచ్ ఈ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేస్తున్న టైమ్‌లో అకౌంట్ నెంబర్ ముందు తొమ్మిది నెంబర్‌ను పొరపాటున యాడ్ చేసింది. ఈ ఫైల్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) లో అప్‌లోడ్ అయ్యింది. ఈ తప్పును వెంటనే గుర్తించాం. తప్పు అకౌంట్‌లో పడిన అమౌంట్‌ను తిరిగి తీసుకున్నాం. ఎన్‌ఏసీహెచ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లను అథరైజ్ చేసేముందు అదనంగా చెకింగ్స్ చేస్తాం. బ్యాంక్‌కు ఆర్థికంగా ఎటువంటి లాస్ లేదు’ అని టీఎంబీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
తెలంగాణలోనూ ఇలాంటి సంఘటనే
ఈ ఏడాది మేలో ఇలాంటి సంఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగి చేసిన కాపీ పేస్ట్ తప్పు వలన రూ.1.5 కోట్లు తప్పు అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు వేస్తున్న దళిత బంధు ఫండ్స్ పొరపాటున లోటస్ హాస్పిటల్స్‌కు చెందిన 15 మంది అకౌంట్లలో పడ్డాయి. వీరి శాలరీ అకౌంట్లలో రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ అయ్యాయి. పైన పేర్కొన్న 15 మందిలో 14 మంది తమ అకౌంట్‌లో పడిన ఫండ్స్‌ను తిరిగి ఇచ్చేశారని, ఒకరు మాత్రం ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఎన్ని సార్లు బ్యాంకులు అడిగినా విత్‌డ్రా చేసిన అమౌంట్‌ను తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. బ్యాంక్ ఆయనపై ఐపీసీ 403 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసింది. ఆయన ఫండ్స్ తిరిగిచ్చారు.
తిరిగిచ్చేయాల్సిందే..
బ్యాంకులు పొరపాటున మీ అకౌంట్లలో డబ్బులు వేస్తే వెంటనే విత్‌డ్రా చేయొద్దని, ఖర్చు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి అమౌంట్‌ను కస్టమర్ల అకౌంట్ల నుంచి వారికి చెప్పకుండానే తిరిగి తీసుకునే అధికారం బ్యాంకులకు ఉంటుందని వివరించారు. ఒకవేళ కస్టమర్ తన అకౌంట్‌లో పడిన డబ్బులను ఖర్చు చేస్తే బ్యాంకులు ఆయన్ని సంప్రదిస్తాయని, అప్పటికి తిరిగి ఇవ్వకపోతే లీగల్‌గా ప్రొసీడ్ అవుతాయని అన్నారు. కస్టమర్ చేసిన విత్‌డ్రా అమౌంట్ బ్యాంక్ లోన్‌గా మారుతుందని, ఈ అమౌంట్‌పై వడ్డీ కూడా పడుతుందని వివరించారు. ఒకవేళ కస్టమర్ విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నించినా ఆయన్ని బ్యాంకులు వదలవని చెప్పారు. ది ఛాంబర్ ఆఫ్ లా వెబ్‌సైట్ ప్రకారం, కస్టమర్ అకౌంట్‌లో పొరపాటున ఎస్‌బీఐ 1,99,959.74 డాలర్లు డిపాజిట్ చేసింది. తన తప్పు తెలుసుకున్న బ్యాంక్ 2.5 ఏళ్ల తర్వాత సంబంధిత కస్టమర్ అకౌంట్ నుంచి ఈ కారణం చూపి ఆయనకు చెప్పకుండానే కొంత అమౌంట్‌ను కట్ చేసుకుంది.