
- 12 మందికి గాయాలు
- నిలిపి ఉన్న వాటర్‌ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
- జనగామ శివారు క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఘటన
జనగామ, వెలుగు : ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్‌ను ఆర్టీసీ రాజధాని బస్సు ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 12 మంది గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్ క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని నేషనల్ హైవే పై శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వరంగల్వన్డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ వెళ్తుండగా డివైడర్ పక్కన నిలిపి ఉన్న వాటర్‌ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ బి.యాదగిరి(49) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా12 మంది గాయపడ్డారు.
వీరిలో ఏడుగురిని జనగామ జిల్లా హాస్పిటల్‌కు తరలించి ఫస్ట్‌ఎయిడ్ చేశారు. తర్వాత హైదరాబాద్ గాంధీ, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్‌కు పంపించారు. స్వరూప అనే ప్రయాణికురాలి రెండు కాళ్లు విరిగిపోగా వరంగల్‌కు రెఫర్ చేశారు. వాటర్ట్యాంకర్వద్ద ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ డివైడర్ పైన నిలబడి చెట్లకు నీళ్లు పడుతున్న క్రమంలో బస్సు అతివేగాన్ని గమనించిన ఆయన దూరం జరగడంతో ముప్పు తప్పింది. జనగామ టౌన్‌సీఐ ఎలబోయిన శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వచ్చి గాయపడ్డవారిని వెంట వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.