మహిళలకు ఇబ్బంది లేకుండా చూస్తం..రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతం : సజ్జనార్

మహిళలకు ఇబ్బంది లేకుండా చూస్తం..రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతం : సజ్జనార్

హైదరాబాద్, వెలుగు :  మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పేరిట కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్​కు మంచి స్పందన వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్​ను మహిళలు, బాలికలు, స్టూడెంట్స్, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్​లోని జూబ్లీ బస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి స్కీమ్ అమలు తీరును పరిశీలించారు. జేబీఎస్ – ప్రజ్ఞాపూర్, జేబీఎస్ – జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్​ప్రెస్ బస్​లో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు.

స్కీమ్ అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత జేబీఎస్ – వెంకట్​రెడ్డి నగర్ (రూట్ నంబర్ 18వీ/జే) సిటీ బస్సులో మెట్టుగూడ వరకు సజ్జనార్ ప్రయాణించారు. బస్​లో ప్రయాణిస్తున్న మహిళలకు జీరో టికెట్ అందజేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

40వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించాం

మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి.. 40వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఆధార్ కార్డులను కండక్టర్​కు చూపించాలన్నారు. స్కీమ్ స్టార్ట్ అయ్యాక సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కొంత రష్ తగ్గిందని వివరించారు.

శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు సుమారు 21లక్షల మంది మహిళలు ఫ్రీగా జర్నీ చేశారని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. 24 గంటలు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ నంబర్లు 040 – 69440000, 040 – 23450033 కు ఫోన్ చేయాలన్నారు.