
- జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం
- ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందుంచిన నేతలు
- సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొన్నం హామీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి నిర్వహించాలనుకున్న సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, హన్మంతు ముదిరాజ్, థామస్ రెడ్డి తదితరులతో మంత్రి పొన్నం చర్చలు జరిపారు. ఇందులో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రామ్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మొత్తం 11 డిమాండ్లను మంత్రి పొన్నం ముందుంచారు.
ఇందులో 9 డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని.. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. మిగతా 9 డిమాండ్లలో ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సర్క్యులర్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం, సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టడం, రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే సెటిల్‌మెంట్స్ చేయడం, 2017 వేతన సవరణ జరిపి బకాయిలు చెల్లించడం, 8 గంటల పని విధానం అమలు, 2019 సమ్మె టైమ్‌లో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించడం వంటివి ఉన్నాయి.
ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టిసారించిందని, అందుకు తీసుకుంటున్న చర్యలను జేఏసీ నేతలకు పొన్నం వివరించారు. దీంతో సంతృప్తి చెందిన నేతలు మిగతా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వంపై నమ్మకంతోనే వాయిదా: ఈదురు వెంకన్న
ప్రభుత్వంపై, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఉన్న నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. మంత్రి పొన్నంతో చర్చలు జరిపిన తర్వాత మీడియాతో వెంకన్న మాట్లాడారు. ‘‘మేం పెట్టిన డిమాండ్లకు మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. అందుకే సమ్మెను వాయిదా వేశాం. దీన్ని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు గుర్తించి యథావిధిగా విధులకు హాజరుకావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరిస్తం: పొన్నం
సమ్మె వాయిదా వేస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మెను వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తానని జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు.
తమ ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి విషయంలో అండగా ఉన్నదని, సంస్థకు వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే, మేం మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల బాట పట్టించాం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు. సీసీఎస్, పీఎఫ్ నిధులను వాడుకొని ఆ బకాయిలు చెల్లించలేదు. కానీ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ సంస్థను కాపాడుతూ వస్తున్నాం” అని తెలిపారు.