రష్యా బలం.. యూరప్ బలహీనత.. నేచురల్ గ్యాస్

రష్యా బలం.. యూరప్ బలహీనత.. నేచురల్ గ్యాస్

మాడ్రిడ్: ఉక్రెయిన్‌‌పై రష్యా దాడి వ్యవహారం యూరప్ దేశాలకు ప్రాణసంకటంగా మారింది. ఆంక్షలు విధిస్తామంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. రష్యాతో విరోధం తమకే నష్టం అని ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే దశాబ్దాలుగా రష్యా నుంచి వచ్చే నేచురల్ గ్యాస్‌‌పైనే ఈ దేశాలు ఆధారపడ్డాయి. ప్రస్తుతం వీటి వద్ద గ్యాస్ రిజర్వులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎనర్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. యుద్ధమే జరిగితే రష్యా నుంచి పైప్‌‌లైన్ గ్యాస్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎనర్జీ సెక్యూరిటీ, ఆల్టర్నేటివ్ ఏర్పాట్ల గురించి ఈయూ దేశాలు ఆలోచిస్తున్నాయి.

షిప్పుల్లో తెప్పించుకోవాలని.. 
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌‌ఎన్‌‌జీ)ని అమెరికా, ఖతార్, అల్జీరియా, ఇతర దేశాల నుంచి షిప్పుల ద్వారా తెప్పించుకోవాలని యూరోపియన్ యూనియన్ భావిస్తోంది. అలాగే రిన్యూవబుల్ ఎనర్జీ వినియోగం పెంచడం వల్ల రష్యన్ గ్యాస్‌‌పై ఆధారపడటం తగ్గుతుందని ఆలోచిస్తోంది. ఎనర్జీ సెక్యూరిటీ చాలా కీలకమని, విపత్కర పరిస్థితులు ఎదురైనా వేరే ప్లాన్లు రెడీగా ఉండాలని ఈయూ ఎనర్జీ కమిషనర్ కద్రి సిమ్సన్ చెప్పారు. ‘‘ఈ వింటర్ అంతా సేఫ్‌‌ సైడ్‌‌లోనే ఈయూ ఉంటుంది. ఇదే సమయంలో ఈ డిపెండెన్సీని వదిలించుకోవడానికి సాధ్యమైనదంతా చేస్తోంది’’ అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ శనివారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌‌లో అన్నారు. అజర్‌‌‌‌బైజన్‌‌ నుంచి టర్కీ, గ్రీస్ మీదుగా వెస్ట్రన్ యూరప్‌‌కు కొత్త పైప్‌‌లైన్‌‌ ద్వారా గ్యాస్ తరలిస్తున్నారు. ఈశాన్య గ్రీస్ నుంచి దక్షిణ బల్గేరియా వరకు పైప్‌‌లైన్ పొడిగించాలని కూడా ప్లాన్ చేశారు. రష్యన్ గ్యాస్‌‌పై బల్గేరియా పూర్తిగా ఆధారపడకుండా ఈ ఏర్పాటు చేశారు. సముద్రం ద్వారా ఎల్‌‌ఎన్‌‌జీని దిగుమతి చేసుకునే ఫెసిలిటీని నిర్మించే ప్లాన్‌‌తో గ్రీస్ ముందుకు సాగుతోంది.

30 శాతం యూరప్ నుంచే..
దీర్ఘకాలిక కాంట్రాక్టుల ప్రకారం గ్యాస్ అమ్మిన రష్యా.. స్పాట్ మార్కెట్‌‌లో అదనంగా అమ్మే విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. ప్రస్తుతం సాధారణం కంటే తక్కువ గ్యాస్‌‌ను అమ్ముతోంది. గ్యాస్ సప్లై నిలిపేసే ఆలోచన తమకు లేదని చెబుతోంది. మరోవైపు సెక్యూరిటీ అనలిస్టులు కూడా.. రష్యా మొత్తం గ్యాస్ కట్‌‌ ఆఫ్‌‌పై పెద్దగా ఆసక్తి చూపదని పేర్కొంటున్నారు. ఇప్పటికే లిథువానియా, పోలాండ్ తదితర దేశాలు రష్యన్ గ్యాస్ దిగుమతులను తగ్గించుకున్నాయి. అయినప్పటికీ ఈయూకు జరుగుతున్న గ్యాస్ సప్లైలో దాదాపు 30 శాతం పైగా రష్యా నుంచే వస్తున్నది. బాల్టిక్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ, సౌత్ ఈస్ట్రన్ యూరప్ దేశాలు ఎక్కువగా రష్యా గ్యాస్‌‌పైనే ఆధారపడ్డాయి.