రష్యాలో సరుకులు అయిపోతున్నయ్

రష్యాలో సరుకులు అయిపోతున్నయ్
  • సూపర్ మార్కెట్లలో అమ్మకాలపై లిమిట్స్ పెట్టిన సర్కార్ 
  • ఇప్పటికే 40 శాతం పెరిగిన ధరలు 
  • కరెన్సీ మార్చుకునేందుకూ జనం ఇబ్బందులు 
  • 1990 నాటి ఆర్థిక సంక్షోభంలా ఉందంటున్న ఎనలిస్టులు 

మాస్కో: ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షల ప్రభావం రష్యాలోని సూపర్ మార్కెట్లపైనా పడింది. సరుకులు అయిపోయే ప్రమాదం తలెత్తడం, బ్లాక్ మార్కెట్ దందా జరిగే అవకాశం ఉండటంతో షాపింగ్ మాల్స్ పెద్ద మొత్తాల్లో సరుకుల్ని అమ్మరాదంటూ ప్రభుత్వం పరిమితులు పెట్టింది. దీంతో ఒక్కో వ్యక్తి లిమిట్ గానే నిత్యావసర సరుకులను కొనుక్కోవాల్సి వస్తోంది. నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు 40 శాతం వరకూ పెరిగాయి. యుద్ధం పేరు చెప్పి అనేక సంస్థలు ఉద్యోగులకు జీతాల్లో కోత విధిస్తున్నాయి. వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్ని సైతం జాప్యం చేస్తున్నాయి. విదేశీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్ని రష్యాలో విక్రయించకూడదని నిర్ణయించాయి. రెండ్రోజుల నుంచి ఆపిల్ -పే సేవలు ఆగిపోయాయి. నైక్ తదితర ప్రముఖ బ్రాండ్లు ఆన్లైన్ విక్రయాలను నిలిపేశాయి. హాలీవుడ్ స్టూడియోలూ రష్యాలో సినిమాల విడుదలను ఆపేశాయి. మందులు, వైద్య పరికరాలూ దొరకడం లేదు. 1990ల నాటి కష్టాలు మళ్లీ కళ్లముందు మెదులుతున్నాయి. 

ఏటీఎంలలో పైసలు నిల్ 

స్విఫ్ట్ నెట్ వర్క్ నుంచి రష్యన్ బ్యాంకులను తొలగించడంతో.. విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు స్తంభించిపోయాయి. రూబుల్స్ ను విదేశీ కరెన్సీగా మార్చుకోలేకపోతున్నారు. చెల్లింపు వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఏటీఎంలలో డబ్బులు రావడంలేదు. కార్డులు పనిచేయడం లేదు. డిపాజిట్ లూ కష్టంగానే మారింది. రూబుల్ విలువ పడిపోతుండటంతో వీలైనంత త్వరగా తమ సొమ్మును విదేశీ కరెన్సీలోకి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 1998 తర్వాత తలెత్తిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే. ఆహారం కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయించే పరిస్థితి రష్యాకు రావచ్చని అంటున్నారు. మరోవైపు రష్యా.. ట్విటర్, ఫేస్ బుక్, బీబీసీ యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసింది. రష్యా దాడుల గురించి ఉక్రెయిన్, ఇతర ప్రాంతాల నుంచి సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.