న్యూయార్క్: కజకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఎలెనా రిబకినా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ రిబకినా 6–1, 6–4తో నవోమి ఒసాకా (జపాన్)పై గెలిచింది. ఈ టోర్నీలో రిబకినా సెమీస్‌కు చేరుకుంటే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకునే చాన్స్ ఉంది. ఇక ఒసాకాతో గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రిబకినా సర్వీస్‌ల్లో సత్తా చాటింది.
తన సర్వీస్‌లో 70 శాతం పాయింట్లు రాబట్టిన కజక్ ప్లేయర్ ప్రత్యర్థి సర్వీసుల్లో 50 శాతం పాయింట్లు సాధించింది. మ్యాచ్ మొత్తంలో 7 ఏస్‌లు, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. 8 బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. 29 విన్నర్లు, 17 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. 2 ఏస్‌లు, 5 డబుల్ ఫాల్ట్స్ చేసిన ఒసాకా ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా సాధించలేదు. 9 విన్నర్లు, 15 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది.
మరో మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–4తో ఇవా జోవిక్ (అమెరికా)పై గెలిచింది. మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–2, 7–6 (7/3)తో లూసియానో డార్డెరి (ఇటలీ)పై, అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) 6–3, 4–6, 7–5, 7–5తో ఫ్రాన్సిస్కో సెరుండోలో (అర్జెంటీనా)పై, కరెన్ ఖచనోవ్ (రష్యా) 7–5, 4–6, 6–7 (6/8), 6–1, 6–4తో లెర్నర్ టియాన్ (అమెరికా)పై, వాన్ డి జాండ్స్‌షూప్ (నెదర్లాండ్స్) 3–6, 6–7 (0/7), 7–6 (9/7), 7–6 (7/3), 6–4తో ఆర్థర్ గియా (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
