- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ
కొడంగల్, వెలుగు: రైతులకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నాలో ఆమెతో పాటు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక, బాధ్యత లేవని, ధాన్యం కొనుగోళ్లపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు.
రైతుల కష్టాలను పట్టించుకునే తీరిక సీఎంకు లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం ఇంటి ముందు వడ్ల కుప్పలు పోయాలని కొడంగల్ రైతులకు పిలుపునిచ్చారు. వెంటనే వడ్లను సేకరించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు బొంరాస్‌పేట్ మండలం తూంకిమెట్ల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
