మోడీపై పోటీకి దిగిన మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ

మోడీపై పోటీకి దిగిన మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ

వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేయాలనుకున్న BSF మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. తేజ్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేయాలనుకున్నారు. తేజ్ బహదూర్ యాదవ్ ఇచ్చిన పత్రాల్లో పూర్తి సమాచారం లేదని.. ఆయనను ఉద్యోగం నుంచి BSF తొలగించిందా.. లేక కేంద్రంపై అసంతృప్తితో ఉద్యోగం వదిలివెళ్లారా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని మంగళవారం నాడు నోటీసు పంపింది. బుధవారం ఉదయం 11 గంటలకల్లా రిప్లై ఇవ్వాలని సూచించింది. ఆలోపు తేజ్ బహదూర్ రిప్లై ఇవ్వలేదు. దీంతో… అతడి నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్టు వారణాసి రిటర్నింగ్ అధికారి సురేంద్ర సింగ్ చెప్పారు. 

సుప్రీంకోర్టుకు వెళ్తా : తేజ్ బహదూర్ యాదవ్

“నేను అన్ని సర్టిఫికెట్లు ఇచ్చాను. ఐనా.. ఇంత తక్కువ టైమ్ లో ఢిల్లీకి వెళ్లి మరో సర్టిఫికెట్ తేవడం సాధ్యమేనా..? సాయంకాలం అబ్జెక్షన్ చెప్పి.. ఉదయం కల్లా సర్టిఫికెట్ కావాలంటే ఎలా.. అంబానీ, అదానీ లాంటివాళ్లకే అలాంటిది సాధ్యంకాదు. నేను రిటర్నింగ్ అధికారుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తా. గురువారం నాడు పిటిషన్ వేస్తా. నేను పోటీలో ఉండటంతో.. మోడీ భయపడ్డారు. కుట్ర చేసి.. నా నామినేషన్ ను రద్దు చేయించారు. నామినేషన్ వ్యవహారంలో సుప్రీంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా” అన్నారు తేజ్ బహదూర్ యాదవ్. 

BSF సైనికులకు సరైన ఆహారం పెట్టడం లేదనీ.. వసతులు కల్పించడం లేదనీ 2017లో జవాన్ తేజ్ బహదూర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి సంచలనం రేపారు. దానిపై ఆర్మీ కూడా స్పందించింది. అంతర్గత విచారణ జరిపి వీడియోలో సైనికుడు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చింది. ఇలాంటి ఫిర్యాదులు సోషల్ మీడియాలో కాకుండా.. నేరుగా తమకు చేస్తే ఫలితం ఉంటుందంటూ.. తేజ్ బహదూర్ పై క్రమశిక్షణ చర్యల కింద డిస్మిస్ చేసింది.  

సైనికుడితో మోడీ తలపడాల్సింది : అఖిలేష్

తాజా లోక్ సభ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అతడికి ఎస్పీ టికెట్ దక్కింది. ఈ వ్యవహారంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. “జాతీయ వాదం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీవాళ్లు ఓ సైనికుడితో తలపడాల్సింది. తినే ఫుడ్డు గురించి ఫిర్యాదు చేసిన ఓ సైనికుడిని డిస్మిస్ చేశారు. వాళ్లను నిజమైన దేశభక్తులని జనం ఎలా పిలుస్తారు..?” అని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.