బడ్జెట్​ ఇండ్ల అమ్మకాలు డౌన్​

బడ్జెట్​ ఇండ్ల అమ్మకాలు డౌన్​

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు నగరాల్లో అఫోర్డబుల్ కేటగిరీ ( రూ. 40 లక్షల కంటే తక్కువ ధర) ఇండ్ల అమ్మకాలు- 18 శాతం తగ్గి 46,650 యూనిట్లకు పడిపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో బడ్జెట్​ ఇండ్ల విక్రయాలు 57,060 యూనిట్లుగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్ట్​ ప్రకారం, మొత్తం ఇండ్ల విక్రయాలలో బడ్జెట్​ ఇండ్ల వాటా జనవరి–-జూన్‌‌లో 31 శాతం నుంచి 20 శాతానికి పడిపోయింది. మొత్తం ఇండ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-–జూన్‌‌లో 1,84,000 యూనిట్ల నుంచి 2,28,860 యూనిట్లకు పెరిగాయి. 

కరోనా కారణంగా డిమాండ్​లో వచ్చిన మార్పులు,  డెవలపర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్న అనేక ఇతర సవాళ్ల కారణంగా మొత్తం అమ్మకాలలో బడ్జెట్​ ఇండ్ల వాటా తగ్గిపోయిందని అనరాక్​ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. భూమి ధర గణనీయంగా పెరిగిందని  పేర్కొన్నారు. తక్కువ మార్జిన్ ఇండ్లను నిర్మించడానికి డెవలపర్లకు భూమి దొరకడం కష్టంగా మారుతున్నదని చెప్పారు.  . అంతేగాక హౌసింగ్​లోన్లపై వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం కూడా ఒక సమస్య అని  వివరించారు.

  •   ఢిల్లీ–-ఎన్‌‌సీఆర్‌‌లో బడ్జెట్​ ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–-జూన్ కాలంలో 8,680 యూనిట్లకు పడిపోయాయి. గత సంవత్సరంలో 14,150 యూనిట్లు అమ్ముడయ్యాయి.
  •  ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అమ్మకాలు 17,650 యూనిట్ల నుంచి 17,470 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి.
  •  బెంగళూరులో తక్కువ బడ్జెట్ ఇండ్ల విక్రయాలు 3,990 యూనిట్ల నుంచి 3,270 యూనిట్లకు తగ్గాయి.
  •  పూణేలో ఈ కేటగిరీలో అమ్మకాలు 9,700 యూనిట్లుగా ఉన్నాయి, గత క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 11,240 యూనిట్లు అమ్ముడుపోయాయి.
  •  హైదరాబాద్‌‌లో బడ్జెట్​ ఇండ్ల విక్రయాలు 50 శాతానికి పైగా పడిపోయి 1,460 యూనిట్ల నుంచి 720 యూనిట్లకు తగ్గాయి.
  •  చెన్నైలో బడ్జెట్​ ఇండ్ల సేల్స్​ 3,170 యూనిట్ల నుంచి 1,820 యూనిట్లకు తగ్గాయి.
  •  కోల్‌‌కతాలో వీటి అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంలో 5,400 యూనిట్ల నుంచి ఈ ఏడాది జనవరి-–జూన్‌‌లో 4,990 యూనిట్లకు తగ్గాయి.