మరో మూడు నెలలు సేల్స్ ఇలాగే ఉంటాయ్

మరో మూడు నెలలు సేల్స్ ఇలాగే ఉంటాయ్
  • మార్చి చివరి వరకు పల్లెటూళ్లలో సేల్స్​ డల్​!
  • హెచ్‌‌‌‌2లో రూరల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ తక్కువే
  • ప్రకటించిన ఎడల్వీస్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ రిపోర్టు

న్యూఢిల్లీ:  బేస్ ఎక్కువగా ఉండటం, ధరల పెరుగుదల, ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో పల్లెటూళ్ల మార్కెట్లలో ప్యాకేజ్డ్ వస్తువులకు డిమాండ్ తక్కువగా ఉండవచ్చని బ్రోకరేజ్ ఎడెల్వీస్ రీసెర్చ్‌‌‌‌ రిపోర్టు పేర్కొంది. నిజానికి కరోనా మహమ్మారి తరువాత పల్లెటూళ్ల మార్కెట్లు బాగా పెరిగాయి. పట్టణ మార్కెట్ల కంటే ముందంజలో ఉన్నాయి కూడా. అయితే ఈ గ్రోత్‌‌‌‌ ఇప్పుడు చల్లబడుతున్నట్లు కనిపిస్తోంది. మోడర్న్​ ట్రేడ్​ గాడినపడటంతో కరోనా సెకండ్‌‌‌‌ వేవ్ తర్వాత పట్టణ మార్కెట్లు వేగంగా రికవరీ అవుతున్నాయి. అన్ని సెగ్మెంట్లలోనూ అమ్మకాలు పెరిగాయి. గ్రామీణ మార్కెట్లలో మాత్రం ఈ వేగం కనిపించడం లేదు. గత రెండేళ్ల వరకు చూస్తే పల్లెటూళ్ల మార్కెట్‌‌‌‌లో అమ్మకాలు ఇప్పటికీ కోవిడ్ -పూర్వస్థాయుల కంటే ముందున్నాయి. పల్లెటూళ్లలో సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల వంటి ఎఫ్‌‌‌‌ఎంసీజీ వస్తువులకు డిమాండ్‌‌‌‌ చాలా ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ‘‘చాలా ఎఫ్‌‌‌‌ఎంసీజీ  కంపెనీలకు 2023 ఆర్థిక సంవత్సరం బాగుంటుంది. మెజారిటీ కంపెనీలు ఆశించిన రికవరీని సాధించే అవకాశాలు ఉన్నాయి ’’ ఈ రిపోర్టు వివరించింది.

పట్టణాల్లో  ఓకే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సర హెచ్‌‌‌‌1లో (ఈ ఏడాది   అక్టోబరు నుంచి 2022 మార్చి దాకా) రూరల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ పెద్దగా పుంజుకోకపోవచ్చని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఒకరు అన్నారు. మారికో,  డాబర్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ పరిస్థితి తాత్కాలికమేనని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. అధిక బేస్,  ధరల పెరుగుదల, వస్తువుల బరువును తగ్గించడం, అకాల వర్షాలు, ఆలస్యంగా చలికాలం రావడం వంటివి ఈ పరిస్థితికి కారణమని అంటున్నాయి.  పల్లెటూళ్లలో మందగమనం కారణంగా ఏర్పడిన కొరత అర్బన్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ ద్వారా భర్తీ అవుతుందని పేర్కొంటున్నాయి. "దీర్ఘకాలంలో పల్లెటూళ్ల నుంచి గ్రోత్‌‌‌‌ పటిష్టంగా ఉంటుందని,  పట్టణ ప్రాంతాల కంటే ముందంజలో ఉంటుందని కంపెనీలు అనుకుంటున్నాయి. పెద్ద ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలకు 2023 ఆర్థిక సంవత్సరం అమ్మకాలు బాగానే ఉంటాయి. ఎఫ్ఎంసీజీల మొత్తం తలసరి వాడకంలో పల్లెటూళ్ల తలసరి వినియోగం మూడింట ఒక వంతు ఉంటుంది. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. కంపెనీలు ఆకర్షణీయమైన ధరలతో ప్రొడక్టులను అమ్ముతున్నాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలకు నేరుగా దగ్గరవుతున్నాయి’’ అని ఎడల్వీస్‌‌‌‌ రిపోర్టు వివరించింది.