మళ్లీ శామ్​సంగే​ నం.1

మళ్లీ శామ్​సంగే​ నం.1

న్యూఢిల్లీ: స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ శామ్​సంగ్​ వరుసగా నాలుగో క్వార్టర్​లో మనదేశ స్మార్ట్‌‌‌‌ఫోన్ మార్కెట్‌‌‌‌లో 17.2 శాతం వాటాతో మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. ఏ, ఎం సిరీస్‌‌‌‌ ఫోన్ల అమ్మకాలు దూసుకెళ్లడంతో ఈ దక్షిణ కొరియా కంపెనీ​ మార్కెట్​చాంపియన్​గా నిలిచింది.  భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం, ఆఫ్​లైన్​లోనూ అమ్మకాలు పెంచుకోవడం ఇందుకు కారణాలు. 

మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ​ప్రకారం.. సెప్టెంబరు క్వార్టర్​లో ఐఫోన్​ మేకర్​ యాపిల్​ ఎగుమతులు ఆల్​టైం హైకి  చేరాయి. ఈసారి ఇది 25 లక్షల యూనిట్లను అమ్మింది. రెడ్​మీ 12 సిరీస్‌‌‌‌ ఫోన్లకు బలమైన డిమాండ్ ఉండటం, ఆఫ్‌‌‌‌లైన్ విస్తరణ వల్ల షావోమీ రెండోస్థానంలో నిలిచింది. ఇది 16.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుందని కౌంటర్ పాయింట్  రీసెర్చ్ అనలిస్ట్ శుభమ్ సింగ్ చెప్పారు.  ఈ క్వార్టర్​లో 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ షిప్‌‌‌‌మెంట్ల వాటా 53 శాతానికి చేరుకుంది. రూ. 10వేల-–15వేల సెగ్మెంట్‌‌‌‌లో లాంచ్‌‌‌‌లను పెంచడం ద్వారా ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మేకర్లు (ఓఈఎంలు) భారీ వృద్ధిని సాధించాయి. 

ఈ విభాగంలో 5జీ ఫోన్ల వ్యాప్తి 35 శాతానికి చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం కాలంలో 7 శాతంగా ఉంది. 2023 మూడవ క్వార్టర్​లో ఓఈఎంలు కొత్త డివైజ్​లను లాంచ్​ చేయడంపై దృష్టి సారించాయి.  రాబోయే పండుగ సీజన్‌‌‌‌కు సిద్ధం కావడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి.  పెద్ద ఎత్తున 5జీ ఫోన్లను లాంచ్​ చేశాయి. తక్కువ ధరకే అధిక ర్యామ్​ గల ఫోన్లను అందించాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శిల్పి జైన్ తెలిపారు. 

ఖరీదైన ఫోన్లకు మస్తు గిరాకీ..

రూ. 45వేల కంటే ఎక్కువ ధర ఉన్న  స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజా క్వార్టర్​లో సులభతరమైన ఫైనాన్సింగ్, ఆఫర్ల కారణంగా అల్ట్రా- ప్రీమియం సెగ్మెంట్ సంవత్సరానికి  44 శాతం వృద్ధిని సాధించింది. అల్ట్రా -ప్రీమియం సెగ్మెంట్‌‌‌‌లో ఫోల్డబుల్స్‌‌‌‌ ఫోన్లకు ఎక్కువ ఆదరణ ఉంది. ఈ విభాగంలోకి మరిన్ని ఓఈఎంలు వస్తున్నాయి. భవిష్యత్తు వారికి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇటీవల వన్​ప్లస్​ కూడా ఫోల్డబుల్​ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఈసారి యాపిల్  34 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.   

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌‌‌‌ఫోన్ మార్కెట్‌‌‌‌ అయిన ఇండియా ప్రీమియమైజేషన్ ప్రారంభమైందని కౌంటర్​ పాయింట్​ తెలిపింది. వన్​ప్లస్​ రూ. 30వేలు–-రూ. 45వేల ధరల విభాగంలో అగ్ర బ్రాండ్‌‌‌‌గా ఉంది. వన్​ప్లస్​11ఆర్​ బలమైన అమ్మకాలను సాధించింది. ఈ సెగ్మెంట్​లో 29 శాతం వాటా సాధించిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.