
సంగారెడ్డిలో 1927లో ‘మోహన్‍రెడ్డి’ పేరుతో గాడ్ల వీరారెడ్డి స్వీట్ హౌజ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వీరారెడ్డి కొడుకు మోహన్‍రెడ్డి దాని బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన తర్వాత నర్సింహా రెడ్డి.. ప్రస్తుతం నర్సింహారెడ్డి కొడుకు రంజిత్ రెడ్డి ఈ స్వీట్‍హౌజ్ ను నడుపుతున్నాడు. వీరారెడ్డి స్వీట్ హౌజ్ మొదలుపెట్టినప్పుడు ఎంతో పేరొచ్చింది. ఇక్కడి రుచులకు చాలామంది ఫిదా అయ్యారు. ఇప్పటికీ అంతే రుచిగా అందిస్తామంటున్నాడు రంజిత్‌రెడ్డి. ఈ స్వీట్ హౌజ్‌లో దొరికే స్వీట్లు, మిక్చర్ కోసం జనాలు క్యూ కడుతున్నారు.
అమెరికాకు..
మోహన్‍రెడ్డి దుకాణంలో మిఠాయిలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా, దుబాయ్ దేశాల్లో ఈ సంగారెడ్డి స్వీట్లకు అభిమానులు ఉన్నారు. అందుకే నిజాం నవాబుల కాలం నుంచే ఆర్డర్లపై అమెరికా, దుబాయ్‌కి ఎగుమతి చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అయితే ఈ స్వీట్ల గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. సంగారెడ్డి పరిసర గ్రామాల్లో ఉండేవాళ్లు మోహన్‍రెడ్డి స్వీట్లు, మిక్చర్ కొని తమ బంధువులకు పంపిస్తుంటారు. ఇక్కడ బర్ఫీ, కోవాపేడ, మైసూర్‍పాక్, బాదుషా, మిక్చర్, బూందీ, పకోడి, దాల్‌మోతె ప్రత్యేకం.
ఇంకా కట్టెల పొయ్యిపైనే..
తొంభై ఏళ్ల నుంచి ఈ స్వీట్ హౌజ్‌లో అన్ని పదార్థాలనూ కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు. అంతే కాకుండా వీళ్లు నూనెను ఒకసారి మాత్రమే వాడతారు. అన్ని నాణ్యమైన పదార్థాలే ఉపయోగిస్తారు. ఏ రోజు స్వీట్లు ఆరోజే తయారు చేస్తారు. అందుకే సంగారెడ్డిలో మోహన్‍రెడ్డి స్వీట్లకు అంత డిమాండ్.