పందేలకు..రెడీ!.. కాలు దువ్వుతున్న కోళ్లు

పందేలకు..రెడీ!.. కాలు దువ్వుతున్న కోళ్లు
  •  ఇయ్యాల్టి నుంచి పందేలు షురూ..

ఖమ్మం, వెలుగు :  సంక్రాంతి వచ్చిందంటే పందెం రాయుళ్లకు పండుగే. ఆ మూడు రోజులు కోడి పందేల్లో మునిగితేలుతుంటారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆ సంస్కృతి లేకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని ఆనుకుని ఉండడంతో ఆయా మండలాల్లో ఆంధ్రా కల్చర్ ప్రభావం ఉంటుంది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఉన్న తోటల్లో రహస్యంగాఏటా కోడి పందేలు జోరుగా సాగుతాయి.

ఇక్కడ పోలీసులు రూల్స్​ పై కఠినంగా ఉంటే సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని ఏపీ పరిధిలో పందేలు నిర్వహిస్తారు. ఇక ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే పోలీసుల సపోర్టుతో, అధికారికంగానే పందేలు నిర్వహిస్తారు. కోడిపందేల్లో ఎత్తుడు- దింపుడు, డింకీ పందేలు, ముసుగులు పోటీలు, పేకాటలో 13 కార్డ్స్, మూడు ముక్కలాట, పట్టాలు, గ్యాంబ్లింగ్, చిరగుండు, కోసు లాంటి పందేలు నిర్వహిస్తారు. అన్ని పోటీల్లో కలిపి రూ.కోట్లలో చేతులు మారుతాయి. జూదరుల కోసం కొన్ని చోట్ల ప్రత్యేకంగా మొబైల్ ఏటీఎం సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. 

గ్రౌండ్ గా ప్రిపేర్

సరిహద్దు గ్రామాల్లోని చాలా తోటలు పందెం బిర్రులుగా మారుతున్నాయి. కోడి పందేలకు, పేకాటలకు పామాయిల్, కొబ్బరి, మామిడి తోటల్లో అత్యంత రహస్యంగా నిర్వాహకులు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరి, లోన పేకాట, బయట కోడి పందేలు నిర్వహిస్తారు. ఇక కోళ్లకు కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వాటిని పందేలకు నిర్వాహకులు సిద్ధం చేశారు. 

పుంజులకు ప్రత్యేక శిక్షణ 

పెరటి కోళ్ల రూపంలో కోడి పుంజులను మాత్రమే పెంచుతారు. కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చినప్పటి నుంచి ప్రత్యేక బలవర్ధక ఆహార నియమావళి, వ్యాయామం, పోరాట శిక్షణ ఇలా ఎన్నో అంచెలుగా చూసుకుంటూ పెంచుతారు. కోడిపుంజుల కోసం ఏర్పాటు చేసిన శాఖలలో వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

పరుగు పెట్టించడం, కొంచెంసేపు సాటి పుంజులతో పోరాటం చేయడం నేర్పిస్తారు. రోజూ చన్నీళ్లలో ఈత కొట్టించి ఎండలో ఆరబెడతారు. వారం కొకసారి వేడి నీళ్లలో స్నానం చేయిస్తారు. పోరాట పటిమ కోసం రహస్యంగా కొన్ని తర్ఫీదులను ఇస్తున్నారు. అవి చెప్పడానికి పెంపకందారులు ఇష్టపడరు. అందువల్ల ఈ కోడిపుంజులు ఆంధ్ర ప్రాంతంలో చాలా ఫేమస్. 

ఒక్కో  పుంజు రూ.40 వేల వరకు.. 

ఆంధ్రాలోని అమరావతి, నెల్లూరు, భీమవరం, ఏలూరు, రాజమహేంద్రవరం పలు పలు ప్రాంతాల నుంచి వచ్చి సత్తుపల్లి, అశ్వారావుపేట సరిహద్దుల్లో కోడిపుంజులను కొనుగోలు చేస్తుంటారు. పందెం కోళ్లు సుమారు 50 రకాలు ఉన్నాయి. నెమలి, కాకి, డేగా, పచ్చ కాకి, పర్లా, సేతువు, పులా, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్ర బోరా, నల్ల బోరా, మైలా, కొక్కిరై, నల్ల సవాలా, ఇలా అనేక రకాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రాంతాలను బట్టి పేర్లు మారిపోతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోళ్లు పందేలకు పెట్టింది పేరు. వీటి ధర ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. 

ఈ ప్రాంతాల్లో ఎక్కువ

భోగి, సంక్రాంతి, కనుమ, ఈ మూడు రోజులు సంక్రాంతి పందేలకు అడ్డూఅదుపు ఉండదు. జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి శివారులోని  చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఐదారు చోట్ల పందేలు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తారు. సత్తుపల్లి ప్రాంతంలో కొందరు పందెం బిర్రులు తీసుకుని పందేలు నడిపిస్తారు. జిల్లాకు ఏపీ సరిహద్దు గ్రామాలైన మేడిశెట్టివారిపాలెం, ముత్తగూడెం, తిరుమలకుంట, వినాయకపురం, జమ్మిగూడెం, నారంవారిగూడెం, నాగుపల్లి, పట్వారీగూడెం, వడ్లగూడెం, పెద్దగొల్లగూడెం, రాచన్నగూడెం సమీపంలో కోడిపందేలు జరుగుతాయి.

వత్సవాయి, గన్నవరం, దెందులూరు, తిరువూరు, చింతలపూడి, నూజివీడు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని తోటలన్నీ కోడి పందేలకు అడ్డాలుగా మారుతాయి. ఇంకా పెద్ద పెద్ద పందేలు భీమవరంలో, భీమవరం కోప్పాకలో భారీ సెట్టింగుల మధ్యన నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు, వ్యాపారులు కూడా ఈ పందేల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. 

సెప్టెంబర్​ నుంచి ప్రత్యేకంగా పెంచుతాం

పందెం పుంజులను సెప్టెంబర్ నుంచి ప్రత్యేకంగా పెంచుతాం. వీటికి బాదం, కోడి గుడ్డు, రాగులు, మటన్ ఆహారంగా అందిస్తాం. ఒక్కో కోడి పుంజుకు నెలకు రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో పుంజు సంక్రాంతి సీజన్ లో రూ.20 వేల వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం 20 పుంజులు పెంచుతున్నాం. వీటికి నెలకు రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది.  
-
 ఎడ్ల సుబ్బారావు, కోళ్ల పెంపకందారుడు